GWMC Commissioner T. Venkanna, Warangal Rainwater Harvesting Initiative
* వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
* అమృత్–2.0లో షాలో ఆక్విఫర్ మేనేజ్మెంట్ (SAM–2.0)పై దృశ్య మాధ్యమ సమీక్ష
* నగరంలో 20 నీటి రీచార్జ్ గుంతల ఏర్పాటు – నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ
అకేరు న్యూస్, వరంగల్ : వర్షపు నీటిని ప్రతి చుక్క ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అన్నారు.
గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) అమృత్–2.0 సబ్ మిషన్‌లో భాగంగా నిర్వహించిన షాలో ఆక్విఫర్ మేనేజ్మెంట్ (SAM–2.0) పద్ధతులు, విధానాలపై దృశ్య మాధ్యమ సమీక్షా కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నిస్సార భూగర్భ జల వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్–2.0 పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా దేశంలోని 10 నగరాల్లో విజయవంతంగా అమలు చేసిన SAM–2.0 కార్యక్రమాన్ని మరో 75 నగరాలకు విస్తరిస్తోందన్నారు.
భూగర్భ జలాల పరిరక్షణలో భాగంగా ఆక్విఫర్ మ్యాపింగ్, వర్షపు నీటి రీచార్జ్ వ్యూహాలు, పట్టణ ప్రణాళికల సమన్వయం కీలకమని పేర్కొన్నారు. నగరంలో వర్షపు నీటి రీచార్జ్ పాయింట్ల ఏర్పాటుకు రూ.35 లక్షలు మంజూరయ్యాయని, ఇప్పటికే 20 నీటి రీచార్జ్ గుంతలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించడం అత్యంత అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు భూగర్భ జల మట్టం పెంపునకు అవసరమైన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.
అనంతరం నీటి సంరక్షణ, నీటి పొదుపుపై నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్ఐయూఏ ప్రతినిధులు వర్షపు నీటి నిల్వ, సంరక్షణ, రీచార్జ్ పద్ధతులపై దృశ్య మాధ్యమం ద్వారా వివరించారు. కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, మెప్మా పీడీ రాజేశ్వర్, డీఎఫ్‌వో శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, హెచ్‌వో లక్ష్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు మహేందర్, సంతోష్ బాబు, మాధవీలత, ఎన్ఐయూఏ ప్రాజెక్టు అధికారులు నవనీత్, మనీషా చౌహాన్, ఎన్ఆర్ఎస్ఏ జియాలజిస్ట్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
