BC Gurukul Sailing Championship
* ఇటలీ ఇంటర్నేషనల్ సెయిలింగ్ పోటీలకు బిసి గురుకుల విద్యార్థుల ఎంపిక
* శుభాకాంక్షలు తెలిపిన బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
తెలంగాణ ప్రభుత్వ మహాత్మా జ్యోతిబా పూలే బిసి సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ప్రతిభను చాటారు. అత్యంత పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వీరు, తమ పట్టుదలతో జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి, ఇప్పుడు ఇటలీలో జరగనున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు.
ఈ పోటీలకు ఎంపికైన వారిలో కామారెడ్డి బిసి గురుకుల పాఠశాలకు చెందిన రిష్విత, మునుగోడు పాఠశాలకు చెందిన హనుమంతు, కమలాపూర్ పాఠశాలకు చెందిన కౌనిక్ వర్ధన్ ఉన్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి, క్రీడల్లో అంకితభావం, క్రమశిక్షణతో శ్రమించి వీరు ఈ అంతర్జాతీయ స్థాయి అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు పూర్తి ఆత్మవిశ్వాసంతో పోటీపడి తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ వేదికపై సాధించే విజయావకాశాల ప్రయాణంలో తెలంగాణ ప్రభుత్వం బిసి సంక్షేమ శాఖ విద్యార్థులకు నిరంతరం అండగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.
