Komuravelli Mallanna Railway Station
* నేడే కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
* ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, సిద్దిపేట: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ఆధ్యాత్మిక క్షేత్రమైన కొమురవెల్లికి మౌలిక సదుపాయాలను మరింత పెంచుతూ నూతనంగా నిర్మించిన ‘కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్’ నేడు ప్రారంభం కానుంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ స్టేషన్ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
సుమారు ₹5.63 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో ఈ రైల్వే స్టేషన్ను నిర్మించారు. ఇప్పటివరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రోడ్డు మార్గంపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పుడు నేరుగా రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఈ స్టేషన్ ప్రారంభంతో భక్తులతో పాటు స్థానిక ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రయాణికులకు రవాణా కష్టాలు తప్పనున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
