Collector Chahat Bajpai, Hanamkonda SIR Process
అకేరు న్యూస్, హనుమకొండ: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు.
* పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ
కనకదుర్గ కాలనీ, వడ్డేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సుధానగర్ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రాలను పరిశీలించారు. అలాగే కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియ, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల జారీపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
* నోటీసుల్లో జాప్యం వద్దు
అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులను ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే అందించాలని బీఎల్ఓలను ఆదేశించారు. సెలవు రోజుల్లో ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండే అవకాశం ఉన్నందున నోటీసుల పంపిణీలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివరాల్లో చిన్నచిన్న వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను యాప్లో అప్లోడ్ చేసి, నిబంధనల ప్రకారం హియరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
* యాప్ ప్రక్రియ పరిశీలన
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల మేరకు పూర్తి చేయడంతో పాటు ఓటర్లకు అవసరమైన సమాచారం, సేవలు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం ఏఈఆర్వోలు, బీఎల్ఓలు యాప్ ద్వారా నిర్వహిస్తున్న డాక్యుమెంట్ అప్లోడ్, హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఈఆర్వో, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, హనుమకొండ ఏఈఆర్వో, తహసీల్దార్ రవీందర్రెడ్డి, బీఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
