Akbaruddin CURE Bill
* మేయర్ అధికారాలపై అభ్యంతరం
* 20% ఆస్తి పన్నుపై ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఆమోదం పొందిన కోర్ అర్బన్ రీజన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ (CURE) బిల్లు-2026పై ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 1955 నాటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా నగర పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని ఆయన విమర్శించారు.
* మేయర్ అధికారాలపై అభ్యంతరం
CURE బిల్లులో ముఖ్యమంత్రి నేతృత్వంలో ‘ఎపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ‘ఎగ్జిక్యూటివ్ కమిటీ’ ఏర్పాటు చేయడాన్ని అక్బరుద్దీన్ తప్పుబట్టారు. ప్రజలు ఎన్నుకున్న మేయర్, కార్పొరేటర్ల అధికారాలను తగ్గించి అధికారుల చేతుల్లోనే కీలక నిర్ణయాలు పెట్టడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగంలోని 74వ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.
* 20 శాతం ఆస్తి పన్ను పెంపుపై ఆగ్రహం
బిల్లులోని క్లాజ్ 78 ప్రకారం ఏటా 20 శాతం వరకు ఆస్తి పన్ను పెంచే అవకాశం సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని అక్బరుద్దీన్ అన్నారు. పన్ను పునఃపరిశీలనలో తగ్గినా ఆ ప్రయోజనం ప్రజలకు అందేలా తగిన రక్షణ నిబంధనలు లేవని పేర్కొన్నారు. పన్ను క్లెయిమ్‌లకు ఉన్న 30 రోజుల గడువును కూడా పొడిగించాలని కోరారు.
* సీవరేజ్ ఛార్జీలపై అభ్యంతరం
డ్రైనేజీ సౌకర్యాలు లేని ప్రాంతాల్లో కూడా సీవరేజ్ రుసుములు వసూలు చేయడం అన్యాయమని ఆయన అన్నారు. ఏటా 5 శాతం సీవరేజ్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.
* మూడు కార్పొరేషన్లుగా విభజన
GHMC స్థానంలో GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి పేర్లతో మూడు స్వతంత్ర కార్పొరేషన్లను ఏర్పాటు చేసే విధానంపై కూడా అక్బరుద్దీన్ స్పందించారు. CURE బిల్లు మొత్తం 5 భాగాలు, 43 అధ్యాయాలు, 319 సెక్షన్లు, 9 షెడ్యూళ్లతో రూపొందిందని తెలిపారు.
* ప్రజా సౌకర్యాలు నిలిపివేయొద్దు
భవనంలోని ఒక భాగంలో ఉల్లంఘన జరిగిందనే కారణంతో ఉల్లంఘనకు సంబంధం లేని ఇతర భాగాలకు విద్యుత్, తాగునీటి కనెక్షన్లు నిలిపివేయడం సరికాదని అక్బరుద్దీన్ అన్నారు. బిల్డర్ల తప్పులకు నివాసితులను బాధ్యులను చేయొద్దని కోరారు.
* పాతబస్తీ అభివృద్ధికి నిధులు
పాతబస్తీలో తాగునీరు, రహదారులు, స్మశానవాటికల అభివృద్ధికి నిధులు కేటాయించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. గత మూడేళ్లకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని, మెట్రో రైల్ ప్రాజెక్టు బాధితులకు అందించిన పరిహార వివరాలను వెల్లడించాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
