Minister Seethakka Assures Full Support to Flood-Affected Families in Mulugu
* ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
* వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన
– మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు:
వరద ముప్పుపై ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గోదావరి తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నామని, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
శనివారం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటిడిఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి మంగపేటలో గోదావరి వరద ప్రవాహాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మంగపేట గోదావరి కరకట్ట నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, బ్యాక్‌వాటర్ ప్రభావంతో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చెందిన 28 కుటుంబాల 112 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు.గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నందని, నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఏటూరు నాగారం మండలం కేంద్రం లోని రామన్నగూడెం పుష్కర ఘాట్ లను మంత్రి సీతక్క, అధికారులతో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత రెండు రోజులుగా తెలంగాణ తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగుతున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటిడిఏ పిఓ, సాగునీటి శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారుల తో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లుగా ములుగు జిల్లాలో ప్రత్యేక వరద నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి, వాగులు, గోదావరి పరివాహక ప్రాంతాలు, ముంపు గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని వివరించారు.
గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకున్నప్పటికీ ముందస్తు చర్యల కారణంగా ఎలాంటి నష్టం జరగలేదన్నారు. రెండు నెలల క్రితమే గోదావరి పరివాహక ప్రాంతాల్లో జిల్లా ఉన్నత అధికారులతో, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
రామన్నగూడెం, మంగపేట ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, సుమారు 800 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. 2022, 2023 సంవత్సరాల్లో గోదావరి, జంపన్నవాగు వరదల వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మిగిలిన కరకట్ట పనులను కూడా పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పిస్తామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలను గుర్తించి రెండో విడతలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏ ఎస్ పి మనన్ భట్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,ఆర్డీవో కృష్ణవేణి, డి పి ఓ వెంకయ్య, తహసిల్దార్ తోట రవీందర్, ఎం పి డి ఓ బద్రూ, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
