Minister Seethakka Extends Relief to Flood-Affected Families in Dulapur
* దూలాపురంలో 7 ముంపు బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్ల పంపిణీ
ఆకేరు న్యూస్, ములుగు:
వాజేడు మండలం దూలాపురం గ్రామంలో ముంపు ప్రభావానికి గురైన కుటుంబాలకు రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క అండగా నిలిచారు. గ్రామంలో ముంపు పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న 7 కుటుంబాలను గుర్తించి, వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లను మంత్రి సీతక్క అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముంపు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
ముంపు ప్రభావిత కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, దుప్పట్లు తదితర సహాయక సామగ్రిని అందించడం ద్వారా వారికి తక్షణ ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, నదులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని మంత్రి సీతక్క సూచించారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
