Minister Ponnam Prabhakar Husnabad Development Funds
* 28 పనులకు గ్రీన్ సిగ్నల్
* ఆకేర్ న్యూస్, హుస్నాబాద్ :
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు మరియు క్రాస్ డ్రైనేజ్ పనుల నిర్మాణం కోసం రూ.33.70 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మొత్తం 28 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో నెం.425 ను జారీ చేశారు. సిద్ధిపేట, హనుమకొండ మరియు కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలకు ఈ నిధులు కేటాయించబడ్డాయి.
జిల్లాల వారీగా నిధుల కేటాయింపు వివరాలను పరిశీలిస్తే, సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లోని 15 పనులకు గాను రూ.15 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కోహెడ మండల పరిధిలో కాచాపూర్ – పందిళ్ల బ్రిడ్జి నిర్మాణం, పందిళ్ల నుండి పర్వేద ఎక్స్ రోడ్ పనులతో పాటు మొత్తం 10 పనులకు రూ.7.20 కోట్లు కేటాయించారు. అలాగే హుస్నాబాద్ మండలంలో మాలపల్లి – కుచనపల్లి బ్రిడ్జి నిర్మాణం సహా రెండు పనులకు రూ.3.50 కోట్లు, అక్కన్నపేట మండలంలో కొండమంజరుపల్లి – రెగొండ మధ్య హెచ్ఎల్బీ బ్రిడ్జితో పాటు మూడు పనులకు రూ.4.30 కోట్లు మంజూరయ్యాయి. హనుమకొండ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో మొత్తం 5 పనుల కోసం రూ.7.70 కోట్లు కేటాయించారు. భీమదేవరపల్లి మండలంలో రాసూల్‌పల్లి – వీర్లగడ్డ తండా లో-లెవల్ కాజ్వే, రాసూల్‌పల్లి నుండి బంగ్లాపల్లి, బొల్లొనిపల్లి మార్గాల్లో హెచ్ఎల్బీ బ్రిడ్జీల నిర్మాణాలు సహా 4 పనులకు రూ.6.20 కోట్లు కేటాయించగా, ఎల్కతుర్తి మండలంలో ఇందిరానగర్ – గోపాల్పూర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో 8 పనుల కోసం రూ.11 కోట్లు కేటాయించారు. సైదాపూర్ మండలంలో దుద్దెనపల్లి – మొగిలిపాలెం బ్రిడ్జి నిర్మాణం, ఇతర పనులతో కలిపి రూ.6 కోట్లు, చిగురుమామిడి మండలంలో నవాబ్‌పేట్ – పొట్లపల్లి డ్రైనేజ్ పనులు, ఇతర నిర్మాణాల కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పనులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు సులభతరం కావడమే కాకుండా, ప్రతీ వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి ప్రజలు ఎదుర్కొనే రవాణా దిగ్బంధన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ, నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. హుస్నాబాద్ నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు గాను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మరియు సంబంధిత శాఖల మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు తీసుకువచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
