Sri Chaitanya Hostel Ragging
* ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్ విద్యార్థులు
* టెన్త్ విద్యార్థిపై మూకుమ్మడి దాడి
* విషమంగా విద్యార్థి పరిస్థితి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని శ్రీచైతన్య హాస్టల్ లో దారుణం చోటుచేసుకుంది. టెన్త్ క్లాసు విద్యార్థిపై తోటి విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ చేయడంతో ఈ దుస్థితి ఏర్పడిందని విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* పోలీసులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం..
కామారెడ్డి జిల్లాకు చెందిన అభిషేక్ రెడ్డి దమ్మాయిగూడ శ్రీచైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. నిన్న రాత్రి సమయంలో హాస్టల్లో ఉన్న అభిషేక్‌తో కొంతమంది సీనియర్ విద్యార్థులు అకారణంగా గొడవ పడ్డారు. అంతేకాకుండా దాదాపు 12 మంది అతడిపై దాడికి పాల్పడ్డారు. వద్దు.. వద్దు అని ఎంత వేడుకుంటున్నా సీనియర్ విద్యార్థులు వినలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
* కర్రలు, ప్లేట్లతో కొట్టి.. బూట్లతో తన్ని..
అభిషేక్‌ను సీనియర్ విద్యార్థులు చాలా తీవ్రంగా కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్రలు, ప్లేట్లతో కొట్టడంతో పాటు, బూట్లతో ముఖంపై తొక్కినట్లు తెలుస్తోంది. 12 మంది విద్యార్థుల దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే విషయం బయటకు రాకుండా ఉండేందుకు పాఠశాల యాజమాన్యం సరైన సమాచారం ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
* మెట్లపై నుంచి పడ్డాడని..
అభిషేక్ మెట్లపై నుంచి జారి పడ్డాడని హాస్టల్ నిర్వాహకులు అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. హాస్టల్ లో ర్యాగింగ్ ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని అభిషేక్ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లగా అక్కడ అభిషేక్ అసలు విషయం చెప్పాడు. తీవ్ర గాయాలు ఉండడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
