Maripeda Police Station Accident
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్లోనే సిబ్బందికి రక్షణ కరువైంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్లో బుధవారం ఒక దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర శిథిలావస్థకు చేరిన స్టేషన్ భవనంలో విధులు నిర్వహిస్తుండగా, అకస్మాత్తుగా భవనం సీలింగ్ పెచ్చులు ఊడిపడటంతో అక్కడ డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏఎస్సై) శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు.
* పనిచేస్తుండగా పడ్డ పెచ్చులు…
ఏఎస్సై శ్రీనివాసరావు స్టేషన్లోని తన టేబుల్ వద్ద రోజువారీ విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో పైనున్న కాంక్రీట్ సీలింగ్ పెచ్చులు పెద్ద శబ్దంతో ఆయనపై ఊడిపడ్డాయి. ఈ హఠాత్ పరిణామంతో ఆయన భుజంపై తీవ్రమైన గాయమైంది. ఊహించని ఈ ప్రమాదంతో భయాందోళనకు గురైన తోటి సిబ్బంది వెంటనే తేరుకుని, రక్తమోడుతున్న శ్రీనివాసరావును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు.
* అరచేతిలో ప్రాణాల తో డ్యూటీ…
మరిపెడ పోలీస్ స్టేషన్ భవనం నిర్మించి దశాబ్దాలు కావడంతో తీవ్రంగా దెబ్బతిన్నదని, పగుళ్లు బారిన పడి శిథిలావస్థకు చేరిందని స్థానిక సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలోనూ, ఇతర సమయాల్లోనూ ఎప్పుడు ఎక్కడ నుంచి కాంక్రీట్ ఊడిపడుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించాల్సి వస్తోందని వాపోతున్నారు.
* కొత్త భవనం నిర్మించాలని డిమాండ్..
రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్లోనే ఈ తరహా ప్రమాదం జరగడంతో తోటి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం తక్షణమే స్పందించి, మరిపెడ పోలీస్ స్టేషన్కు నూతన భవనాన్ని మంజూరు చేయాలని, లేదా ప్రత్యామ్నాయ భవనంలోకి స్టేషన్ను తరలించి సిబ్బంది ప్రాణాలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
