Hanamkonda Youth Congress Suspension
* నలుగురిపై సస్పెన్షన్ వేటు
ఆకేరు న్యూస్, హన్మకొండ : హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పార్టీలో అంతర్గత విభేదాలు, క్రమశిక్షణా ఉల్లంఘనల నేపథ్యంలో అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది. జిల్లాకు చెందిన నలుగురు కీలక యూత్ కాంగ్రెస్ నాయకులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జ్ సయ్యద్ ఖలీల్ అహ్మద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
* క్రమశిక్షణ ఉల్లంఘనే కారణమా..
గత కొన్ని రోజులుగా హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీలో ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం, అధిష్టాన ఆదేశాలను ధిక్కరిస్తూ సొంత నిర్ణయాలు తీసుకోవడం, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడం వంటి ఆరోపణలపై సదరు నాయకులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. అయినా వారి తీరులో మార్పు రాకపోవడంతో, పిసిసి మరియు జాతీయ కమిటీ దృష్టికి ఈ అంశం వెళ్లింది.
విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం, ప్రాథమిక విచారణ అనంతరం సదరు నలుగురు నాయకులను పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు వారు బాధ్యతలు వహిస్తున్న పదవుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
* జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళ, సొంత జిల్లాలోనే యూత్ కాంగ్రెస్ నేతలపై ఈ స్థాయిలో సస్పెన్షన్ వేటు పడటం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఎవరైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని, అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నారని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని, ప్రతి ఒక్క కార్యకర్త మరియు నాయకుడు పార్టీ నిబంధనలకు లోబడి పనిచేయాలని జాతీయ కార్యదర్శి సయ్యద్ ఖలీల్ అహ్మద్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
