Hyderabad Traffic Problems
* మహానగరంలో అదొక నరకం!
* వానొస్తే ట్రాఫిక్ దుర్భరం
* ప్రధానంగా ఐటీ కారిడార్‌లో చుక్కలు
* 15 నిమిషాలకే 2 లక్షల వాహనాలు రోడ్డుపైకి..
* పీక్ అవర్స్ లో 2 కిలోమీటర్లకు 20 నిమిషాల పయనం
* ప్రముఖంగా ఆ ప్రాంతాల్లోనే ఇబ్బందులు
ఆంధ్రజ్యోతి, ప్రత్యేక ప్రతినిధి :
పేరుకే మహానగరం. పైపై మెరుగులు. చినుకు పడితే మాత్రం వాహనదారులకు ఒణుకే. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో నరకం. అధికారులు తాత్కాలిక చర్యలు చేపడుతున్నా ఏమాత్రం ఉపశమనం లభించడం లేదు. అందుకు కారణాలు ఏంటి? పరిష్కారానికి ఏం చేయాలి? ప్రధానంగా హైదరాబాద్‌లోని ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి? నిపుణులు ఏం చెబుతున్నారు? వంటి అంశాలపై ఆకేరు న్యూస్ సవివరణ కథనం..
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల ఉత్పన్నం వెనుక మానవ ప్రమేయం ఉందని తెలిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించడంలో కొందరు అధికారుల తీరు మారడం లేదు. ఒకవేళ గుర్తించినా మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో విఫలం అవుతున్నారు. ఫలితంగా వర్షాకాలం ఈసీజన్ లో కూడా నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. పాలనా సౌలభ్యం కోసం మహా మహానగరంగా విస్తరించింది. జీహెచ్ ఎంసీని మూడుగా విభజించింది. 300 డివిజన్లను చేసింది. కమిషనరేట్లను నాలుగు(ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌తో కలిపి)గా విభజించింది. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించి ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించాలనే విన్నపాలు పెరుగుతున్నాయి.

* అన్నింట్లో గుడ్.. ట్రాఫిక్‌లో బ్యాడ్
గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రధాన ఆదాయ వనరుగా సైబరాబాద్ ప్రాంతం నిలుస్తోంది. దేశంలోనే వేగంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ ఐటీ, రియల్ ఎస్టేట్, వాణిజ్య కంపెనీలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నాయి. హైరైజ్డ్ భవనాలకు నిలయంగా మారింది. దీంతో ఈ ప్రాంతంలో లక్షల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో సైబరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికలు ప్రతిపాదనల దశకే పరిమితం అవుతున్నాయి. దీంతో పీక్ అవర్స్‌లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఐకియా సెంటర్ సమీపంలో అయితే వాహనాలు గ్రిడ్ లాక్ అవుతాయని వాహనదారుడు శేఖర్‌బాబు వాపోయారు. ఆ ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడి ఇంటికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుంది చెప్పడం కూడా కష్టమే అన్నారు. గంటన్నర పట్టిన సందర్భాలు ఉన్నాయని “ఆకేరు న్యూస్” ప్రతినిధితో పేర్కొన్నారు. కొత్తగా ఫ్లైఓవర్, అండర్ పాస్ లు వచ్చినా, అంతకంతకు వాహనాలు పెరుగుతుండడంతో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గడం లేదని వెల్లడించారు.
* ఈ ప్రాంతాల్లో సమస్య తీవ్రం
సైబరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. గచ్చిబౌలి జంక్షన్, బొటానికల్ గార్డెన్, కొండాపూర్, మైండ్‌స్పేస్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్ ఇంటర్‌చేంజ్‌లు, కోకాపేట్ జంక్షన్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో పీక్ అవర్‌లో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతోంది. 2 నుంచి 3 కిలోమీటర్ల దూరానికే 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం పడుతోంది. ఒక్కోసారి ట్రాఫిక్ లో ఇరుక్కుని 30 నిమిషాలు దాటిన సందర్భాలు కూడా ఉంటున్నాయని జూబ్లీహిల్స్ కు చెందిన వాహనదారుడు సంతోష్ వెల్లడించారు. భారీ వర్షం పడిన సమయాల్లో సైబర్ టవర్స్ నుంచి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాటేందుకే అంతకు మించిన సమయం పట్టిన సందర్భాలూ ఉన్నాయని తెలిపారు. మెట్రో దశ రెండో దశపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కారు.. దాంతో పాటు మరిన్ని మార్గాలను అన్వేషించి ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించే చర్యలను చేపట్టాలని రాయదుర్గానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి వాసిరెడ్డి గణేష్ కోరారు. జీవితంలో జీతం కోసం సగం కార్యాలయానికే సరిపోతుండగా, సగం ట్రాఫిక్ లోనే గడిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీకెండ్ లో కుటుంబంతో సరదాగా బయటకు రావాలని ఉన్నా, ట్రాఫిక్ గురించి తెలిసి భయం వేస్తోందని అన్నారు.

* నెలకు 30వేల నుంచి 32వేల కొత్త వాహనాలు
ట్రాఫిక్, ఆర్టీఏ శాఖల గణాంకాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి నెలా సుమారు 30,000 నుంచి 32,000 వేల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వాటిలో ఒక్క సైబరాబాద్ పరిధిలోనే నెలకు 14000 నుంచి 16000 కొత్త వాహనాలు వస్తున్నాయి. ఆ సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంటోంది. తెలంగాణలో అత్యధిక వాహనాలున్న ప్రాంతంగా సైబరాబాద్ ఉంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండడం, ప్రముఖ ఆస్పత్రులు ఉండడం, వాటికి అనుబంధంగా జరిగే వ్యాపార కార్యకలాపాలతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటున్నాయి. కాలనీలకు ప్రజారవాణా అంతగా లేకపోవడంతో గడప దాటి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ వాహనంతోనే రోడ్డెక్కుతున్నారు. ఐటీ నిపుణులైతే ఒక్కో ఇంట్లో రెండు కార్లు, ద్విచక్ర వాహనాలు ఉంటున్నాయి. సిటీలో తిరగడానికి ఎలక్ట్రిక్ వాహనాలు, దూర ప్రాంతాల కోసం డీజిల్, పెట్రోలు వాహనాలను కూడా అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా 14వేల నుంచి 16వేల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం రోజుకు సగటున 1,500 కంటే ఎక్కువ కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వాటిలో శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్పల్లి పరిసరాల్లోనే రోజుకు 500 నుండి 700 వరకు కొత్త వాహనాలు ఆర్టీఏలో నమోదవుతున్నాయి.
* 15 నిమిషాల వ్యవధిలోనే.. 2,00,000 వాహనాలు
ఐటీ కంపెనీలు, పాఠశాలల వేళలను బట్టి సైబరాబాద్ పరిధిలోని ట్రాఫిక్ రద్దీ మారిపోతోంది.సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ScSc) తాజాగా జరిపిన సర్వే ప్రకారం పాఠశాలలు ముగిసిన కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే స్కూల్ జోన్లలో 2,00,000 కంటే ఎక్కువ వాహనాలు రోడ్లపైకి వస్తున్నట్లు గుర్తించారు. అలాగే సైబరాబాద్ ట్రాఫిక్ గణాంకాల ప్రకారం ప్రధాన రహదారులపై ప్రతీ కిలోమీటరుకు దాదాపు 9,500 వాహనాలు నడుస్తున్నాయి. వర్షం పడి ట్రాఫిక్ స్తంభించిన సమయంలో ఆ సంఖ్య దాదాపు 15,000కు దాటుతోందని, దీంతో వాహనాలు కిక్కిరిసి ముందుకు కదలడం లేదని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు.

* కారణాలు..
* ఐటీ కారిడార్‌లో కీలక ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పీక్ అవర్స్‌లో ప్రయాణించే కార్లలో 70% కంటే ఎక్కువ మంది ఒంటరిగానే ప్రయాణిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సర్వేలో తేలింది. ట్రాఫిక్ జామ్‌లకు ఇదీ ఓ కారణంగా పేర్కొంటున్నారు.
* వర్షాకాలం సమయంలో చిన్నపాటి వర్షం పడినా, అంతర్గత రహదారులలో చెట్లు, కొమ్మలు విరిగి పడినా వీధులన్నీ వాహనాలతో స్తంభించిపోతున్నాయి.
* ముందస్తు ప్రణాళికలు లేకుండా పలు ప్రాంతాల్లో ఒకేసారి అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి.
* రాయదుర్గం-ఖాజాగూడ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణం, మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ వరకు రోడ్ల మరమ్మతులు, కొండాపూర్, హఫీజ్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి అంజయ్యనగర్ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, వరదనీటి కాలువల నిర్మాణ పనులు, పలు ప్రాంతాల్లో యుటిలిటీ షిఫ్టింగ్, డ్రైనేజీ, కేబుల్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వాహనాలు బారులుదీరుతున్నాయి.
* గచ్చిబౌలి, హైటెక్ సిటీ, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ, కోకాపేట్, నియోపోలిస్, ఖాజాగూడ, మైహోమ్ హబ్, నల్లగండ్ల, తెల్లాపూర్ ప్రాంతాల్లో భారీ అంతస్తుల (హైరైజ్డ్) భవనాలు ఎక్కువగా పెరిగాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు, వాణిజ్య సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. లక్షలాది వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటిని అనుసంధానించే అంతర్గత రహదారులు, ప్రత్యామ్నాయ లింక్ రోడ్లు లేకపోవడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ అవుతోంది.
* చిన్నపాటి వర్షం కురిసినా వర్షపు నీరు రోడ్లపై నిలవడంతో వాహన వేగం మందగించి ట్రాఫిక్ జామ్ అవుతోంది.
* ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల వద్ద బాటిల్నెక్లు ఇరుకుగా ఉండడంతో వాహనాలు బారులుదీరుతున్నాయి.
* పరిష్కారాలు
* పెండింగ్‌లో ఉన్న లింక్ రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి.
* ఇంజనీరింగ్ విభాగం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి లోపాలను గుర్తించాలి. పనులు చేపట్టేటప్పుడు నిపుణులతోనూ చర్చించి ముందస్తు ప్రణాళికలు చేపట్టాలి.
* మున్సిపల్, ట్రాఫిక్, ఇతర శాఖల అధికారులతోనూ సమీక్షలు నిర్వహించి తక్షణ, దీర్ఘకాలిక చర్యలపై దృష్టి సారించాలి.
* చిన్నపాటి వర్షం కురిసినా వర్షపు నీరు రోడ్లపై నిలిచి, వాహనాల వేగం పూర్తిగా తగ్గిపోతోంది. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. నీరు నిలవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.
* ఎక్కడ బాటిల్నెక్లు ఏర్పడుతున్నాయి? యూటర్న్లు, ప్రత్యామ్నాయ మార్గాలు ఎక్కడ అవసరమో పరిశీలన చేయాలి.
* అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సమయాల్లో మార్పులు చేయాలి.
* ట్రాఫిక్ జామ్‌లను బట్టి యూటర్న్ లపై పునరాలోచించాలి.
* ఐటీ కంపెనీలు కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి. కచ్చితంగా అమలు చేసేలా ట్రాఫిక్ అధికారులు వారికి అవగాహన కల్పించాలి.
* నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఫ్లై ఓవర్లు, మెట్రోరైళ్లు మాత్రమే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావని, ప్రధాన రహదారులపై ఒత్తిడిని తగ్గాలంటే లింకు రోడ్ల నిర్మాణం పెరగాలని రవాణా రంగ నిపుణులు నాగేశ్వరరావు సూచిస్తున్నారు. గ్రిడ్ రోడ్ నెట్వర్క్ సర్వీస్ రోడ్లు, సమాంతర రహదారులు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఫ్లైఓవర్లు ముగిసే ప్రాంతాల్లో బాటిల్‌నెక్‌ల తొలగింపు, కీలక జంక్షన్ల రీడిజైన్ అవసరమని భావిస్తున్నారు. ఐటీ కంపెనీలకు చేరువ వరకు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా కూడా వ్యక్తిగత వాహనాలను తగ్గించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కావు. వర్షపు నీరు నిల్వ కాకుండా సమర్థవంతమైన వాటర్ డైన్రేజీ లైన్ల నిర్మాణం, మెట్రో, ఎంఎంటీఎస్, ఎలక్ట్రిక్ బస్సులు వంటి ప్రజారవాణాను విస్తరించాలని జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్ పేర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్‌తో కలిసి తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు పేర్కొంటున్నారు. తాము క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను ప్రభుత్వానికి నివేదించినట్లు చెబుతున్నారు.

* ఈ ప్రాంతాల్లో లింకు రోడ్లు అవసరం..
హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ వెళ్లే వయా హైటెక్స్ మీదుగా లింకు రోడ్డు నిర్మాణం ప్రతిపాదనలో ఉంది. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు పైకి వెళుతున్న వాహనాలను టీ హబ్ నుంచి అండర్‌పాస్ ద్వారా ఓఆర్ఆర్ పైకి మళ్లించేలా లింకు రోడ్డు నిర్మించాలి. మై హోం అవతార్ జంక్షన్ నుంచి కోకాపేట వెళ్లే వాహనాలను మళ్లించేందుకు లింకు రోడ్డు నిర్మాణం అవసరం ఉంది. మాదాపూర్ ఇమేజ్ ఆస్పత్రి నుంచి మైండ్ స్పేస్ మీదుగా టీ హబ్ వరకు అలాగే గచ్చిబౌలి-కొండాపూర్ నుంచి హఫీజ్‌పేట మీదుగా మియాపూర్, లింగంపల్లి వెళ్లే వాహనాలను మళ్లించేందుకు లింకు రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది.
* ఏళ్ల తరబడి అదే దుస్థితి
సైబర్ టవర్స్ నుంచి మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరకు రద్దీ వేళల్లో నిత్య నరకమే. వర్షం పడిందంటే అది పదింతలు ఉంటుంది. ఏళ్ల తరబడి ఇక్కడ ఇదే దుస్థితిని చూస్తున్నా నేను. మార్పు వస్తే బాగుంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి.
– వెంపటి దుర్గాప్రసాద్, వాహనదారుడు, మాదాపూర్.
* ట్రాఫిక్‌లోనే గంటన్నర సమయం
కూకట్పల్లి నుంచి శిల్పారామం రూట్ లో ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటోంది. యశోద ఆస్పత్రి దాటిన తర్వాత నుంచి ట్రాఫిక్ పెరుగుతోంది. అప్పటికే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వచ్చినా ట్రాఫిక్ అంతగా తగ్గలేదు. అటునుంచి వచ్చేటప్పుడు ఒక్కోసారి సాయంత్రం వేళలో గంటన్నరకు పైగా ట్రాఫిక్ ఇరుక్కోవాల్సి వస్తోంది.
– యర్రంశెట్టి నవీన్, సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
