Rs.1.5 Lakh Subsidy for EV Autos
* ఈవీ ఆటోల కొనుగోలుకు రూ. 1.5 లక్షల సబ్సిడీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత గ్రీన్ సిటీగా మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే వారికి భారీ రాయితీ కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు.
* పథకం వివరాలు..
బడ్జెట్: నగరంలో ఉన్న సుమారు 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం రూ. 200 కోట్లతో ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్’ను ప్రవేశపెడుతోంది.
సబ్సిడీ: ఈ పథకం కింద ఎంపికైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్టంగా రూ. 1,50,000 సబ్సిడీ అందిస్తారు.
డ్రైవర్లు తమ పాత ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకోవడానికి లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయడానికి ఈ నగదు ప్రోత్సాహకాన్ని వినియోగించుకోవచ్చు.
హైదరాబాద్‌ను పర్యావరణహితంగా మార్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, నగరంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
