Minister Seethakka Independence Day Celebrations
ఆకేరు న్యూస్,ములుగు :
సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానం లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా అట్టహాసంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దనసరి అనసూయ సీతక్క త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు.
అనంతరం స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో, జెడ్ పి హెచ్ ఎస్ ములుగు,పి ఎం శ్రీ టీ జి ఎం ఎస్ బండారుపల్లి,బ్రహ్మణి విద్యాలయం,టీ జి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ జె సి (బాలికల) ములుగు,బాలసదనం చిన్నారుల, విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, అదనపు ఎస్పీ సదానందం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్వో రవికుమార్, ఆత్మ కమిటీ ములుగు డివిజన్ చైర్మన్ రవీందర్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
765 మహిళా సంఘాలకు రూ.72.50 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు.
లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన రాష్ట్ర మంత్రి సీతక్క.
శనివారం తంగేడు మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద కుటుంబానికి ప్రధాన ఆర్థిక ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోయిన ములుగు జిల్లాలోని 1,318 నిరుపేద కుటుంబాలకు మొత్తం రూ.2 కోట్ల 39 లక్షల ఆర్థిక సహాయం, 765 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.72 కోట్ల 50 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, కుటుంబానికి ఆర్థిక ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచేందుకు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం సహాయక సంఘాల బలోపేతమే లక్ష్యంగా బ్యాంక్ లింకేజీ రుణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
