CKM College Jignasa Competition
* జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీలకు సీకేఏం కళాశాల విద్యార్థుల ఎంపిక
అకేరు న్యూస్ వరంగల్: విద్యార్థుల్లో కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా పరిశోధనా దృక్పథం, సృజనాత్మకత, నూతన ఆలోచనా విధానాలను పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస 2025–26’ రాష్ట్రస్థాయి స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ పోటీలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ పరిశోధనా ప్రాజెక్టులను సమర్పించగా, సుమారు 5,200 మంది విద్యార్థులకు సంబంధించిన 850 ప్రతిభావంతమైన ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.
హైదరాబాద్ నాంపల్లిలోని రూసా రీసెర్చ్ సెంటర్లో గురువారం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు వరంగల్ నగరంలోని సీకేఏం కళాశాల విద్యార్థులు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.
‘కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆఫ్ సీకేఏం కాలేజ్’ అనే అంశంపై రూపొందించిన స్టడీ ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. అసోసియేట్ ప్రొఫెసర్ విజయ్ పాల్ రెడ్డి ప్రాజెక్ట్ సూపర్వైజర్గా విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
ఈ ప్రాజెక్ట్‌లో కూచన మృదుల (బీఎస్సీ కంప్యూటర్ సైన్స్), జె. నందిని (బీఎస్సీ బీజెడ్సీ), బి. లక్ష్మీ (బీఎస్సీ బీజెడ్సీ), ఉమాదేవి (బీఎస్సీ బీజెడ్సీ) విద్యార్థులు పాల్గొన్నారు. తమ కళాశాలలో కార్బన్ ఉద్గారాల పరిస్థితి, వాటి ప్రభావం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేస్తూ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోచయ్యతో పాటు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ పి. సతీష్, లైబ్రేరియన్ అనిల్, ఆయేషా, వసుధ, జ్ఞానేశ్వర్, పాషా తదితర అధ్యాపకులు అభినందించారు. విద్యార్థులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోచయ్య మాట్లాడుతూ.. సీకేఏం కళాశాల నుంచి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం కళాశాలకే కాకుండా వరంగల్ జిల్లాకు కూడా గర్వకారణమని అన్నారు. పరిశోధనాత్మక ఆలోచన, సృజనాత్మకత విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో తమ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా ప్రదర్శించాలని సూచించారు.
రాష్ట్రస్థాయి వేదికపై సీకేఏం కళాశాలతో పాటు ఓరుగల్లు ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో కార్బన్ ఫుట్‌ప్రింట్‌పై విద్యార్థులు రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్రస్థాయి వేదిక లభించడం పర్యావరణంపై యువతలో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనంగా నిలుస్తోంది. గురువారం జరిగే పోటీల్లో సీకేఏం విద్యార్థులు తమ పరిశోధనా ప్రాజెక్ట్‌ను ఎలా ప్రదర్శిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
