Konda Sushmitha TPCC Notice
* కొండా సుస్మిత వ్యాఖ్యలపై పీసీసీ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను లక్ష్యంగా చేసుకుని చేసిన సంచలన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించడమే కాకుండా, మంత్రి కొండా సురేఖ నుంచి వివరణ కోరాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
* వివాదానికి దారితీసిన వ్యాఖ్యలు..
వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విధానాలను ప్రశ్నించడంతో పాటు, పార్టీలో బీసీ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. “అచ్చా కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్” అంటూ విమర్శలు గుప్పించడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్లీ గెలిపించగలరా అని బహిరంగంగా సవాల్ విసిరారు.
* క్రమశిక్షణ కమిటీ హెచ్చరిక..
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను, పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. “పార్టీ నిర్ణయించిన లక్ష్మణ రేఖను ఎంతటివారైనా దాటితే చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు. సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల సమగ్ర సమాచారాన్ని, వీడియో ఆధారాలను తెప్పించుకుని పరిశీలించిన తర్వాత పార్టీ పరమైన తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
* వరంగల్ కాంగ్రెస్లో మరింత ఉద్రిక్తత..
వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఇప్పటికే సీనియర్ నాయకులు, మంత్రుల మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గానికి, కొండా కుటుంబానికి మధ్య టికెట్ రచ్చ నడుస్తున్న తరుణంలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడుపడటం లేదు. దీంతో ఈ సున్నితమైన వ్యవహారాన్ని పీసీసీ, కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా పరిష్కరిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
