Cannabis Smuggling in Telangana
* రూటు మార్చిన స్మగ్లర్లు
* బ్యాగులు, సూట్‌కేసుల్లో గంజాయి సరఫరా
* బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణం
* మరికొందరు కాళ్లకు, పొట్టకు కట్టుకుని రవాణ
* వరుస ఘటనలతో పోలీసుల అప్రమత్తం
* ఎక్కడికక్కడ అరికట్టేందుకు ప్రయత్నం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
షూటూ, బూటుతో చూడడానికి దర్జాగా కనిపిస్తారు. కార్పొరేట్ బాస్‌ల మాదిరిగా బిల్డప్ ఇస్తారు. సూట్‌కేస్‌లు, బ్యాగులతో ప్రయాణం చేస్తారు. ప్రజా రవాణలోనే అందరితో కలిసి రాకపోకలు సాగిస్తారు. ఆ సూట్‌కేసు లేదా బ్యాగు తెరిస్తే కానీ తెలియదు వాళ్లు గంజాయి స్మగ్లర్లు అని. అవును.. స్మగ్లర్లు రూటు మార్చారు. పోలీసులు పసిగట్టకుండా, తాము చేస్తున్నది దొంగ వ్యాపారమనే అనుమానం ఎవరికీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సులు, రైళ్లలోనే గంజాయిని రవాణా చేస్తూ రాష్ట్రాలు దాటి వచ్చేస్తున్నారు. మరికొందరు షర్ట్ లోపల పొట్టచుట్టూ, లేదా ప్యాంటు లోపల కాళ్లకు గంజాయి పొట్లాలు కట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ తరహా కేసులు ఇటీవలి కాలంలో వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
* గంజాయికి అలవాటు.. ఆదాయ వనరుగా మలుచుకుని..
గంజాయికి అలవాటు పడ్డ ఓ రౌడీషీటర్ ఆ తర్వాత దాన్నే ఆదాయ వనరుగా మార్చకున్నాడు. కొంత మందితో ముఠాగా ఏర్పడి స్మగ్లర్ అవతారం ఎత్తాడు. ఒడిశా నుంచి బ్యాగులు, సూటుకేసుల్లో హైదరాబాద్‌కు గంజాయిని రవాణా చేసి, గుట్టుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. నిఘా పెట్టిన సిటీ చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల ముగ్గురు పాత నేరస్థులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.12లక్షల విలువైన 22.22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు షాహిన్నగర్కు చెందిన పాత నేరస్థుడు మీర్జా జాఫర్ బైగ్ అలియాస్ సద్దాంగా పోలీసులు గుర్తించారు. అతను బాలాపూర్ పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్నాడు. కాగా మిగిలిన ఇద్దరు బార్కాస్‌కు చెందిన ఆవాద్ బిన్ ఆలీ అలియాస్ ఆవాద్, కిషన్‌బాగ్‌కు చెందిన సర్థార్ మన్‌ప్రీత్‌సింగ్ దిల్లాన్గా గుర్తించారు. ఆ ఇద్దరు కూడా పాత నేరస్థులుగా పోలీసుల విచారణలో తేలింది.
* ప్రజా రవాణా మార్గాల ద్వారా..
ఒడిశాలోని జన్నీ అలియాస్ సన్నీ అనే వ్యక్తి వద్ద కిలో రూ. 5,000/- చొప్పున 22 కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేసి, నిందితులు మూడు బ్యాగులలో భద్రపరిచారు. పోలీసులు దొరకకుండా ఉండేందుకు మీర్జా జాఫర్ బైగ్, అవాద్, మన్‌ప్రీత్ సింగ్ 20న మధ్యాహ్నం ఖమ్మంలో రైలు దిగీ ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇబ్రహీం బామర్ నేరుగా రైలులోనే హైదరాబాద్ చేరుకున్నారు. డు. గంజాయితో హైదరాబాద్‌కు చేరిన తర్వాత, గంజాయిని సిటీలోని కొనుగోలుదారునికి అందజేయాలని ఇబ్రహీం బామర్ ఆదేశించాడు. దాంతో 21న సాయంత్రం నిందితులు ముగ్గురూ షాహిన్‌నగర్‌లోని సాదత్‌నగర్ బస్టాప్ వద్ద గంజాయి బ్యాగులతో కొనుగోలుదారుని కోసం వేచి చూస్తుండగా, పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, బాలాపూర్ పోలీసులు దాడి చేసి నిందితుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
* ట్రాలీ బ్యాగులతో ఎయిర్ పోర్టు వద్ద..
ఈ ఏడాది జనవరి 30న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మొత్తం ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 9.5 కోట్ల రూపాయల విలువైన 27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్, చెన్నై జోనల్ యూనిట్ అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు: బ్యాంకాక్ నుండి థాయ్ ఎయిర్వేస్ విమానంలో వచ్చిన నలుగురు వ్యక్తులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని తమ చెక్-ఇన్ లగేజ్‌ను తీసుకుంటున్న సమయంలో అధికారులు వారిని ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న ట్రాలీ సూట్‌కేసులు, చెక్-ఇన్ బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లు గుర్తించారు.
* రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. జూలైలో ఇద్దరు వ్యక్తులను, ఒక మైనర్ ను జీఆర్పీ పోలీసులు, ఈగల్ ఫోర్స్ సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నాయి. నిందితులు ట్రాలీ సూట్‌కేసులు , బ్యాక్ బ్యాగ్ లతో సాధారణ ప్రయాణికుల్లా ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానం రావడంతో వారి లగేజ్‌ను ఓపెన్ చేసి చూశారు. అందులో సుమారు రూ. 20.5 లక్షల విలువైన 41 కిలోలకు పైగా గంజాయి లభించడంతో వెంటనే అరెస్ట్ చేశారు.
* బేగంపేట రైల్వేస్టేషన్ లో మహిళ..
ఒడిశాలోని ఫుల్బానీ ప్రాంతానికి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు భువనేశ్వర్ నుండి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోంది. రైలు బేగంపేట స్టేషన్‌కు చేరుకున్న సమయంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీమ్స్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఆమె వద్ద ఉన్న రెండు ట్రాలీ సూట్‌కేసులను తనిఖీ చేయగా, వాటిలో సుమారు రూ. 8 లక్షల విలువైన 16 కిలోలకు పైగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ఏడాది జనవరిలో ఈ ఘటన జరిగింది.
* లగేజీ బ్యాగులో..
మహారాష్ట్రకు చెందిన సూరజ్ అనిల్ యాదవ్, ప్రసాద్ మహాదేవ్ మోహితే విశాఖపట్నం వైపు నుంచి రాజమండ్రి మీదుగా ప్రయాణించి గంజాయిని సేకరించారు. పోలీసుల తనిఖీలను తప్పించుకోవడానికి సికింద్రాబాద్ బదులుగా నాంపల్లి రైల్వే స్టేషన్లో దిగారు. లగేజ్ బ్యాగ్‌తో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న లగేజ్ బ్యాగ్‌లో సుమారు 18 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటన ఏప్రిల్ లో జరిగింది.
* రూ. 1.50 కోట్ల విలువైన సరుకు
అందరి కంటే భిన్నంగా వీరు కాళ్లు, కడుపుపై హాష్ ఆయిల్ ప్యాకెట్లు కట్టుకొని రవాణా చేస్తున్నారు. ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా మాడ్గుల మండలం జి.కొత్తపాలెం గ్రామానికి చెందిన గెమ్మెలి శ్రీను (25) గంజాయి సరఫరాదారుడు. ఇతనికి అతడి భార్య ఐటీ ఉద్యోగిని కేపీ నిబియా (27) సహకారం అందిస్తోంది. వీరు అరకు ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు డబ్బు ఆశ చూపి సరఫరాకు ఒప్పిస్తున్నారు. ఇలా ఏపీ నుంచి 12 కిలోల హాష్ ఆయిల్ బెంగళూరుకు సరఫరా చేస్తే రూ. 10 లక్షలు ఇస్తానని జోజితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అరకుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి నుంచి 12 కిలోల హాష్ ఆయిల్ తీసుకున్నారు. దీన్ని సరఫరా చేసేందుకు చిక్కుడు శరన్ (21), పంగి జగదీష్ (19)తోపాటు మరో ఇద్దరు మైనర్లను ఒప్పించారు. ఒక్కొక్కరి కాళ్లకు 2 కిలోలు, కడుపుపై కిలో చొప్పున హాష్ ఆయిల్ ప్యాకెట్లు ప్లాస్టర్‌తో కట్టారు. ఎల్బీనగర్ లో బస్సు కోసం వేచి ఉండగా ఎల్బీనగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు కలిసి కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.50 కోట్ల విలువైన 12 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
* వరుస దాడులు
స్మగర్లు వినూత్న పద్ధతుల్లో గంజాయి రవాణా చేస్తుండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నిఘా ఉంచారు. అనుమానితులను అదుపులోకి తనిఖీలు చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్ రవాణాను అరికట్టడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలోని ‘ఈగల్’ ఫోర్స్ మరియు రైల్వే పోలీసులు ఇలా నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్యాగు, సూట్ కేసుల్లో తరలిస్తున్న గంజాయి గుట్టు రట్టు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
