Hyderabad CP Sajjanar, Hybrid Cyber Fraud Alert
* ఇంట్లోని పెద్దలను కొత్త సైబర్ మోసాల పట్ల అప్రమత్తం చేయండి
* ఫోన్ పిన్, ఓటీపీలు, బ్యాంక్, ఆధార్ వివరాలను ఫోన్లలో ఫోటోలుగా దాచుకోవద్దు
* ఫోన్ పోయిన వెంటనే సిమ్, బ్యాంక్ సేవలను బ్లాక్ చేయించండి
* సైబర్ మోసం జరిగితే ఆలస్యం లేకుండా 1930, అధికారిక పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి
– హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
సాంప్రదాయ జేబుదొంగతనాలకు ఆధునిక సాంకేతికతను జోడించి, ప్రజల బ్యాంక్ ఖాతాలను క్షణాల్లో ఖాళీ చేస్తున్న కొత్త హైబ్రిడ్ సైబర్ ముఠాల పట్ల హైదరాబాద్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రద్దీ ప్రాంతాల్లో ఫోన్లు కొట్టేయడమే కాకుండా, వాటి ద్వారానే ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఈ సరికొత్త నేరశైలిపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
* మోసం జరిగే తీరు..
బస్సులు, రద్దీ ప్రాంతాల్లో కొన్ని ముఠాలు ప్రయాణికులు ఫోన్ అన్‌లాక్ చేసే సమయంలో పిన్ నంబర్లను, స్క్రీన్ అన్‌లాక్ ప్యాటర్న్ గమనించి మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. ఒకవేళ లాక్ తెలియకపోతే.. బాధితులు కాల్ చేసినప్పుడు మేము బస్సు కండక్టర్లం.. ఫోన్ ఇచ్చేస్తాం అంటూ లేదా నిజంగా ఈ పవన్ మీదేనా అని, ఓనర్ వెరిఫికేషన్ పేరిట మాయమాటలు చెప్పి స్క్రీన్ పాస్వర్డ్లు రాబడుతున్నారు. అనంతరం ఫోన్ గ్యాలరీ, నోట్స్ యాప్‌లలో దాచుకున్న డెబిట్ కార్డులు, ఆధార్/పాన్ వివరాలను సేకరిస్తున్నారు. దొంగిలించిన సిమ్ కార్డు ద్వారా వచ్చే ఓటీపీలతో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు రీసెట్ చేసి, నిధులను ఆన్లైన్ గేమింగ్ యాప్స్, మ్యూల్ అకౌంట్లకు మళ్లించి డ్రా చేస్తున్నారు. ఈ తరహా నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని సజ్జనార్ తెలిపారు.
* అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలు
ఫోన్ పోయిన వెంటనే మీ టెలికాం ఆపరేటర్‌ను సంప్రదించి సిమ్ కార్డును, అలాగే బ్యాంక్ సేవలను తక్షణమే బ్లాక్ చేయించాలి. సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా ఫోన్‌ను కూడా బ్లాక్ చేయడం మంచిది. ఒకవేళ సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రజలకు సూచించారు.
సాంప్రదాయ జేబుదొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారే లక్ష్యంగా ఈ ముఠాలు వ్యవస్థీకృతంగా దోపిడీకి… pic.twitter.com/eSVinTDGGm
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 26, 2026

Please tell us what is wrong. Your report will be sent to the website team.
