Veligonda Project Krishna Water
* 2028లో రెండోదశ పూర్తి
* మార్కాపురం దోర్నాల వద్ద బహిరంగ సభలో సీఎం చంద్రబాబు
ఆకేరు న్యూస్, మార్కాపురం : ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల కల నెరవేరింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాల గుండా బిరబిరా ప్రవహించిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. అనంతరం కరవు నేలను తాకిన కృష్ణమ్మ ప్రవాహానికి పవిత్ర భావంతో సాష్టాంగ నమస్కారం చేశారు. స్థానిక మహిళలు పసుపు-కుంకుమలు, పుష్పాలతో కృష్ణమ్మకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భగీరథ ప్రయత్నంతో కరవు సీమకు కృష్ణమ్మ తరలి వచ్చిందని అన్నారు.
* 30 ఏళ్ల సంకల్పం.. నెరవేరిన కల
1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత తన చేతుల మీదుగానే తొలిదశను ప్రారంభించడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మొదటి దశ కింద నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీరు చేరనుండగా, 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందుతుంది.
* ఫ్లోరైడ్ భూతం మాయం
ప్రాజెక్ట్ సంపూర్ణంగా పూర్తయితే 30 మండలాల పరిధిలోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఉమ్మడి ప్రకాశంలో 3.36 లక్షలు, నెల్లూరులో 84 వేలు, కడప జిల్లాలో 27 వేల ఎకరాలకు జలవసతి లభించి, పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతుందని సీఎం వివరించారు.
* ప్రజలకు పాదాభివందనం
2028లో వెలిగొండ రెండోదశపూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు కోసం తమ సొంత ఊళ్లను, భూములను త్యాగం చేసిన 11 ముంపు గ్రామాల ప్రజలకు సీఎం పాదాభివందనం చేశారు. కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారంతో పాటు అదనంగా మరో రూ.169 కోట్లు మంజూరు చేశామని, 18 ఏళ్లు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ప్యాకేజీ అందించామని స్పష్టం చేశారు. మిగిలిన రూ.1,900 కోట్ల నిధులతో వెలిగొండ రెండో దశ పనులను 2028 నాటికి పూర్తి చేస్తామని, 2028 కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. వేదికపై దివంగత పూల సుబ్బయ్య కుటుంబ సభ్యులను సీఎం ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు వేలాదిగా తరలివచ్చిన రైతాంగం పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
