Konda Surekha Cabinet Removal
* రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అసలు అంశం ఇదేనా..!
* మంత్రిగా కొనసాగుతున్నా ఫ్లెక్సీల్లో సురేఖ ఫొటో మాయం..
* రాఖీతో ‘రాజీ’ సంకేతాలు.. అయినా జోరందుకున్న తొలగింపు ప్రచారం
* హస్తినకు కొండా సురేఖ సైతం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరో కీలక దశకు చేరిందా..? ఆమెపై పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమవుతోందా..? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాల్లో ఈ ప్రశ్నలు మరింత తీవ్రంగా వినిపిస్తున్నాయి.కొండా సురేఖపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సమగ్ర నివేదికను సమర్పించింది. సురేఖ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ నివేదికను TPCC అధ్యక్షుడు బి. మహేష్‌కుమార్ గౌడ్ ద్వారా ఏఐసీసీకి పంపించారు. తుది నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేతిలోనే ఉందని మహేష్‌కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేశారు.
* అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా తాను వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే పోటీ చేస్తానని, పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేస్తానన్న ఆమె వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.ఈ వ్యాఖ్యలకు తనకు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సురేఖ వివరణ ఇచ్చారు. తన కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవేనని, వాటిని తనతో ముడిపెట్టవద్దని ఆమె క్రమశిక్షణ కమిటీకి లేఖ ద్వారా తెలియజేశారు.
అయితే క్రమశిక్షణ కమిటీ మాత్రం ఈ వివరణతో వ్యవహారం ముగించకుండా, గతంలో సురేఖపై వచ్చిన ఫిర్యాదులు, పార్టీలో ఆమె వ్యవహారశైలి, ఇతర నేతలతో ఉన్న విభేదాలు తదితర అంశాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. అంతేకాకుండా సురేఖపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇది పునరావృతమైన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా కమిటీ భావించినట్లు ప్రచారం జరిగింది.
* 19 మంది నేతల బహిరంగ డిమాండ్
సురేఖపై ఒత్తిడి పెరగడానికి మరో కారణం కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు బహిరంగంగా ఆమెపై చర్యలు కోరడం.ఆగస్టు 21న సుమారు 19 మంది కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరగా, మరికొందరు పార్టీ నుంచి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీంతో ఇది కేవలం సురేఖ కుటుంబానికి సంబంధించిన వివాదంగా కాకుండా తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ విభేదాల అంశంగా మారింది.
* కమిటీ నివేదికలో ఏముంది?
క్రమశిక్షణ కమిటీ సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు సమాచారం. ఆమెను రాష్ట్ర కేబినెట్ నుంచి తప్పించడం వరకు చర్య ఉండవచ్చన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే—కమిటీ సిఫారసు చేసినంత మాత్రాన మంత్రి పదవి వెంటనే పోదు. తుది నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుంది. మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఈ వ్యవహారం ఇప్పుడు ఏఐసీసీ పరిధిలో ఉందని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సురేఖ వ్యవహారం పార్టీ అంతర్గత అంశమని, తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని, పార్టీ తీసుకునే నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందేనని ఆయన చెప్పారు.
* రేవంత్ ఢిల్లీ పర్యటన అసలు ఉద్దేశం ఇదేనా..?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రులను కలవడంతో పాటు పార్టీ అధిష్టానంలోని ముఖ్య నేతలతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పరిపాలనా, రాజకీయ అంశాలతో పాటు సురేఖ వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.ముఖ్యంగా సెప్టెంబర్ 2న ఢిల్లీలో వైఎస్ రాజశేఖరరెడ్డి అవార్డు కార్యక్రమంలో రేవంత్ పాల్గొనే అవకాశం ఉండటంతో ఆయన ఒకట్రెండు రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలతో సమావేశాలు జరిగితే సురేఖ వ్యవహారంపై స్పష్టత రావచ్చన్న అంచనాలు పెరిగాయి.
* మంత్రిగా కొనసాగుతుండగానే ఫ్లెక్సీల్లో ఫొటో మాయం
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సీతక్క పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లలో మంత్రి కొండా సురేఖ పేరు, ఫొటో కనిపించలేదు. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార సామగ్రిలో సంబంధిత ప్రాంతానికి చెందిన మంత్రుల ఫొటోలు ఉండటం ఆనవాయితీగా వస్తోంది , హనుమకొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అద్వర్యంలో జరిగిన సమావేశానికి సైతం కొండా సురేఖ హాజరుకాలేదు. ఈ పరిణామాలన్ని మంత్రి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారన్న ప్రచారం మరింత బలపడేందుకు ఉపయోగపడుతోంది.
* రాఖీతో రాజీ కుదరలేదా..?
మరోవైపు ఆగస్టు 28న సురేఖ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం కూడా రాజకీయంగా ఆసక్తిని రేపింది.సీతక్కతో కలిసి రేవంత్‌ను కలిసిన సురేఖకు ఇది వివాదం మొదలైన తర్వాత ముఖ్యమంత్రితో జరిగిన తొలి భేటీ. బంగారు రాఖీ కట్టి స్వీట్లు అందించడం ద్వారా వ్యక్తిగత సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలన్న ప్రయత్నంగా దీనిని కొందరు కాంగ్రెస్ నేతల్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం సయోధ్య కుదిరినట్లుగా కనిపించలేదు. ఏకంగా కొండా సురేఖను నేడో- రేపో మంత్రి వర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
* హస్తినకు కొండా సురేఖ సైతం
ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ లు ఢిల్లీ కి వెళుతున్నారు. ఏఐసీసీ పెద్దలతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పాలన తీరుపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖ సైతం ఢిల్లీ బాట పట్టారు. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌ను కలవడానికి ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నారు.. ఒక వైపు రేవంత్ మరో వైపు కొండా సురేఖ లు అధిష్టానంతో భేటీ తర్వాత సురేఖకు కేబినెట్లో కొనసాగింపు ఉంటుందా? హెచ్చరికతో సరిపెడతారా? లేక మంత్రి పదవి నుంచి తప్పిస్తారా? అన్నది తెలంగాణ లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
———————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
