Irumudi Generational Blockbuster
* ఇలాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది
* ‘ఇరుముడి’ ఓ మిరాకిల్..
* నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
* రవితేజ కోసమే ఈ కథ రాశా : డైరెక్టర్ శివ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన ప్రేక్షకాదరణతో రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
* రవితేజ కాదు త్రినాథ్ కనిపించాలనుకున్నా..
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఎమోషన్, రియలిస్టిక్ వరల్డ్‌తో పాటు తాను కథలో తీసుకున్న మూడు లేయర్ల బ్లెండింగ్ అద్భుతంగా వర్క్ అవుట్ అయిందన్నారు. ప్రతి ఇంట్లోనూ ఈ కథ తమ కథలా, తమ ఇంట్లోని ఆడపిల్ల కథలా, తమ అమ్మానాన్నల కథలా ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారని తెలిపారు. కథ రాస్తున్నప్పుడే ప్రేక్షకులను కదిలించేలా కొన్ని విషయాలను బలంగా చెప్పాలని అనుకున్నానని శివ పేర్కొన్నారు. రవితేజను కొత్తగా చూపించాలనే ఆలోచనతోనే కథను రూపొందించామని, త్రినాథ్ పాత్రలో ఆయనను ప్రేక్షకులు పూర్తిగా స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు.
* నైజాంలో 42 లక్షల మంది చూశారు..
నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ సినిమా మంచి విజయం సాధిస్తుందని భావించినా, తాము ఊహించిన దానికంటే అద్భుతమైన ఫలితం వచ్చిందన్నారు. ఫుట్‌ఫాల్స్ సెన్సేషనల్‌గా ఉన్నాయని, ఇప్పటివరకు నైజాంలోనే సుమారు 42 లక్షల మంది సినిమా చూసినట్లు తెలిపారు. ఫైనల్ నెంబర్ ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని, ఇంతమందికి సినిమా చేరడం ఆనందంగా ఉందన్నారు.
* ట్రండ్ను మార్చిన ‘ఇరుముడిి’
నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘ఇరుముడి’ తమకు ప్రతిరోజూ సర్ప్రైజ్ ఇస్తోందన్నారు. కెరీర్లో ఇలాంటి విజయం ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే వస్తుందని, ఈ సక్సెస్‌తో రవితేజతో పాటు తాము కూడా ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు. సాధారణంగా సినిమాలు రెండు, మూడు వారాలు ఆడితే ఎక్కువ అనే పరిస్థితి ఉందని, కానీ ‘ఇరుముడి’ ఆ ట్రెండ్‌ను మార్చిందన్నారు. రోజురోజుకూ సినిమాకు టాక్ పెరుగుతోందని చెప్పారు.
* మూడు తరాలను థియేటర్లకు తీసుకొచ్చిన సినిమా
ఈ సినిమాలో మంచి సందేశం ఉన్నప్పటికీ తాము ప్రత్యేకంగా సందేశం ఇస్తున్నట్లుగా చెప్పలేదని శివ నిర్వాణ తెలిపారు. సినిమా చూసేటప్పుడు తండ్రులు, కూతుళ్లు ఎమోషనల్ అవుతున్నారని, అమ్మమ్మలు, బామ్మలు సైతం థియేటర్లకు రావడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఒక ప్రేక్షకుడిగా ఇంతమంది మహిళలు థియేటర్లకు రావడం తాను ఇంతకుముందు చూడలేదని చెప్పారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మూడు తరాలు సినిమాను చూడటంతోనే దీనికి జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ అనే పేరు పెట్టినట్లు వివరించారు.
* మంచి టాక్ కిక్ ఇచ్చింది..
ఇప్పటివరకు శివ నిర్వాణ అంటే నిన్ను కోరి, మజిలీ, ఖుషి తరహా సినిమాలను ప్రేక్షకులు ఊహించుకునేవారని, కానీ ‘ఇరుముడి’ తర్వాత ఆయన ఎలాంటి సినిమా అయినా చేయగలరనే కాంప్లిమెంట్స్ వస్తుండటం తనకు ఎంతో కిక్ ఇచ్చిందని శివ తెలిపారు.
* ఈ నెల 10న విజయోత్సవ వేడుక
‘ఇరుముడి’ విజయానికి సంబంధించిన షీల్డ్ ఫంక్షన్, విజయోత్సవ వేడుకను ఈ నెల 10న నిర్వహించే అవకాశం ఉందని నవీన్ ఎర్నేని తెలిపారు. వేడుకను చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
ఈ విజయం నెక్ట్స్ లెవెల్
‘ఇరుముడి’ మిరాకిల్.. ఈ విజయం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నారు. ఇలాంటి విజయాలు దశాబ్దానికి, రెండు దశాబ్దాలకు ఒకసారి వస్తాయని, ఇలాంటి సినిమాను శివ నిర్వాణ తమకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘సినిమాకి పూనకం వస్తే అది బ్లాక్‌బస్టర్.. ప్రేక్షకుడికి వస్తే అది ఇరుముడి’ అని విజయవాడలో తన స్నేహితుడు చెప్పిన మాట తనకు ఎంతో నచ్చిందని నవీన్ ఎర్నేని తెలిపారు.
* చరణ్‌తో సినిమా చేస్తే అద్భుతం
సినిమాలో రామ్ చరణ్ కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంపై శివ స్పందించారు. చరణ్ ఈ సినిమాలో కనిపించి ఉంటే అది అద్భుతంగా ఉండేదన్నారు. అయితే కథకు ఏం అవసరమో దానిని ఆర్గానిక్‌గా చేసుకుంటూ వెళ్లామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి కథ ఆర్గానిక్‌గా కుదిరి, చరణ్ చేస్తే అద్భుతంగా ఉంటుందని అన్నారు.
* ఇండస్ట్రీలో అందరి సక్సెస్ ముఖ్యం
‘ఇరుముడి’ విజయాన్ని దిల్ రాజు కూడా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పడంపై రవిశంకర్ స్పందించారు. ఒక సినిమా విజయం సాధిస్తే ఆ తర్వాత వచ్చే సినిమాకు కూడా అడ్వాంటేజ్ ఉంటుందని, పరిశ్రమలో అందరూ ఆరోగ్యకరమైన వాతావరణంతో ఉంటారని అన్నారు. ఎవరి సినిమా విజయం సాధించినా మిగతా వారు సంతోషిస్తారని, దిల్ రాజు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు.
తెలుగులో తొలి సినిమాతోనే భారీ విజయం
‘ఇరుముడి’తో తెలుగులో తొలిసారి నటించిన నక్షత్ర మాట్లాడుతూ ఈ విజయం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు శివ నిర్వాణ తనకు ఎంతో సపోర్ట్ చేశారని, సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
