Ramba Oorvasi Menaka Movie
* ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా
* సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ఆకేరు న్యూస్, హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. టీజర్, ట్రైలర్ ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచాయి. సెప్టెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
* స్వర్గం నుంచి భూమిపైకి దేవతలు
సాధారణంగా సోషియో ఫాంటసీ సినిమాల్లో మనుషులు ఇంద్రలోకానికి, యముడి వద్దకు వెళ్లే కథలు ఉంటాయని అల్లరి నరేష్ తెలిపారు. కానీ ‘రంభ ఊర్వశి మేనక’లో మాత్రం రంభ, ఊర్వశి, మేనక స్వర్గం నుంచి భూమిపైకి వస్తారని చెప్పారు.
సినిమాలో హీరోకు చిన్నప్పటి నుంచే ఓ డ్రామా కంపెనీ ఉంటుందని, రంభ, ఊర్వశి, మేనకలను దేవతల్లా పూజిస్తుంటాడని వివరించారు. కష్టపడకుండా హీరో కావాలనే ఆలోచనతో ఉండే అతడికి దేవతలు దీవిస్తే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో తానే హీరో అవుతాననే నమ్మకం ఉంటుందని చెప్పారు.
కుటుంబం నుంచి వచ్చిన ఓ పుస్తకంలో ప్రత్యేకమైన ప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారనే నమ్మకం ఉంటుందని, ఆ ప్యాట్రన్‌ను హీరో ఎలా గీశాడు.. దేవతలు వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు.
* చాలా రోజుల తర్వాత మంచి కామెడీ
చంద్ర మోహన్ కథ చెప్పినప్పుడు చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఎంటర్టైనర్ విన్నట్లుగా అనిపించిందని అల్లరి నరేష్ అన్నారు. ప్రేక్షకులు తన నుంచి కితకితలు, బెండు అప్పారావు వంటి కామెడీ సినిమాలను మిస్ అవుతున్నారని, అలాంటి సమయంలో ఈ కథ తనతో పాటు నాగార్జున, సుప్రియ, రాజేష్, నిమ్మకాయల ప్రసాద్‌కు కూడా నచ్చిందని చెప్పారు.
సీజీ వర్క్ కారణంగా బడ్జెట్ ఎక్కువ అవుతుందని తెలిసినా మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో ప్రారంభించామని తెలిపారు. దర్శకుడు చంద్ర మోహన్ మంచి రచయిత కూడా అని, కథను అద్భుతంగా రాసుకొచ్చారని చెప్పారు. నందు మంచి డైలాగ్స్ అందించారని తెలిపారు.
* అప్పుల్లో ఉన్న వ్యక్తిగా అల్లరి నరేష్
సినిమాలో తన పాత్ర చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని అల్లరి నరేష్ చెప్పారు. అందరి దగ్గర అప్పులు చేసి ఉండే వ్యక్తిగా కనిపిస్తానని, ఊరిలో ఎవరూ తనను నమ్మరని తెలిపారు. అందరూ తన క్యారెక్టర్‌ను కొంత నెగిటివ్‌గా భావిస్తారని, అతడి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడనేది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.
* క్లీన్ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్
ప్రేక్షకులు కామెడీని చూసే విధానం మారిందని, తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా దర్శకుడు కామెడీని డిజైన్ చేశారని అల్లరి నరేష్ తెలిపారు. స్వర్గం, నరకం, ఇంద్రలోకం నేపథ్యంలో వచ్చే కథలు చూసి చాలా కాలం అయిందని, అందుకే చిన్నపిల్లలు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతారని అన్నారు. సినిమాలో క్లీన్ కామెడీ ఉంటుందని, కుటుంబం మొత్తం కలిసి చూసేలా తెరకెక్కించామని చెప్పారు. కామెడీ కూడా సహజంగా ఉంటుందని తెలిపారు.
* పెద్ద స్టార్ కాస్ట్‌తో వినోదం
శ్రీనివాస్ రెడ్డి, పెద్ద నరేష్ తనతో కలిసి ట్రావెల్ చేసే పాత్రల్లో కనిపిస్తారని, వారి మధ్య కామెడీ హిలేరియస్‌గా ఉంటుందని అల్లరి నరేష్ చెప్పారు. వెన్నెల కిషోర్, అజయ్, తారక్ పొన్నప్ప తదితరులు కూడా ఆసక్తికరమైన పాత్రల్లో కనిపిస్తారని తెలిపారు. వెన్నెల కిషోర్ పాత్ర చాలా కొత్తగా, ఫన్నీగా ఉంటుందని చెప్పారు. ఇంద్రుడి పాత్ర ఇంగ్లిష్‌లో మాట్లాడుతుందని, మధ్య మధ్యలో హిందీ కూడా వస్తుందని తెలిపారు. సినిమాలో అందరూ మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటులే ఉండటంతో వినోదం అద్భుతంగా వచ్చిందన్నారు.
* కామెడీతో పాటు మంచి ఎమోషన్
‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్గా, హిలేరియస్‌గా ఉంటుందని అల్లరి నరేష్ తెలిపారు. అదే సమయంలో సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంటుందని, ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారని నమ్మకం వ్యక్తం చేశారు.
* ఓజీ స్పూఫ్ ఎందుకు వచ్చిందంటే..
ట్రైలర్లో వైరల్ అయిన ఓజీ స్పూఫ్‌పై అల్లరి నరేష్ స్పందించారు. తన పాత్ర హీరో కావాలని కోరుకుంటుందని, తనకు తెలిసిన భాష సినిమా కాబట్టి సినిమాల్లో వినిపించే భాషలోనే మాట్లాడుతుంటాడని చెప్పారు. సినిమాలో ఓజీ సీక్వెన్స్ వచ్చినప్పుడు అది కథకు పర్ఫెక్ట్గా సింక్ అవుతుందని, ఎందుకు అలా వస్తుందనేది సినిమా చూస్తే అర్థమవుతుందని తెలిపారు.
ఇటీవల కాలంలో ఎక్కువగా డార్క్ జోన్ సినిమాలు వచ్చాయని, ఇప్పుడు ప్రేక్షకులు మళ్లీ లైట్ హార్టెడ్ కామెడీ సినిమాలు, ఎంటర్టైనర్స్ కోరుకుంటున్నారని అల్లరి నరేష్ అన్నారు. ఇకపై రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా చొప్పున బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
* సుడిగాడు 2పై ఆసక్తికర వ్యాఖ్యలు
సుడిగాడు 2 చేయాలని తనకూ ఉందని అల్లరి నరేష్ తెలిపారు. అయితే అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు కాపీరైట్ అంశాలు చాలా మారాయని చెప్పారు. సుడిగాడు సినిమాలో దాదాపు 108 స్పూఫ్స్ చేసినప్పటికీ, అప్పట్లో సంబంధిత దర్శకులు, నిర్మాతల అనుమతులు తీసుకున్నామని గుర్తుచేశారు.
ఇప్పుడు కాపీరైట్ సమస్యలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సినిమా విడుదల సమయంలో ఎలాంటి అభ్యంతరాలు వస్తాయో చెప్పలేమని, అందుకే సీక్వెల్ చేసే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
* మల్టీస్టారర్ సినిమాలకు సిద్ధమే
రితేష్ రానా స్టైల్ తనకు చాలా నచ్చుతుందని అల్లరి నరేష్ అన్నారు. మత్తు వదలరా సినిమా తనకు చాలా ఇష్టమని, ఆయన కథల్లో డీటెయిలింగ్‌తో పాటు సమకాలీన అంశాలను వినోదాత్మకంగా చూపించే విధానం నచ్చుతుందని చెప్పారు. తరుణ్ భాస్కర్ వంటి దర్శకులతో కూడా పనిచేయాలని ఉందన్నారు.
శంభో శివ శంభో నుంచి తాను మల్టీస్టారర్ కథల్లో నటిస్తున్నానని అల్లరి నరేష్ చెప్పారు. మంచి కథతో దర్శకులు వస్తే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. మహర్షి తర్వాత నా సామి రంగ చిత్రంలో నాగార్జున తన పేరును సూచించారని, అందుకే ఆ సినిమాలో నటించానని తెలిపారు.
* బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్
సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్‌తో తొలిసారి పనిచేస్తున్నానని అల్లరి నరేష్ చెప్పారు. తనకు, సురభికి ఓ పాట ఉందని, అది తనకు చాలా నచ్చిందన్నారు. మిగతా నాలుగు పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయని, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు.
* రెండున్నర గంటలు హాయిగా నవ్వుకోండి
ఇటీవల వరకు సీరియస్ సినిమాలు చేశానని, ‘రంభ ఊర్వశి మేనక’ మాత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ అని అల్లరి నరేష్ అన్నారు. ఇది లైట్ హార్టెడ్ ఫిల్మ్ అని, ప్రేక్షకులు రెండున్నర గంటలు హాయిగా నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వెళ్లాలని కోరారు. ప్రస్తుతం ఆల్కహాల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని, కనకదుర్గ షూటింగ్ జరుగుతోందని అల్లరి నరేష్ తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
