Konda Surekha Dismissal Warangal Congress
* కొండా సురేఖ బర్తరఫ్‌తో వరంగల్ కాంగ్రెస్‌లో స్తబ్ధత
* ఏం మాట్లాడితే ఏమవుతుందోననే టెన్షన్
* అగమ్యగోచరంగా అనుచరుల పరిస్థితి
ఆకేరు న్యూస్, వరంగల్:
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన పరిణామం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఒకప్పుడు కొండా కుటుంబం చుట్టూ రాజకీయంగా చురుగ్గా కనిపించిన పలువురు నేతలు, అనుచరులు ఇప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
* కొండా వర్గానికి టెన్షన్
కొండా సురేఖపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో తమపై కూడా రాజకీయ లేదా పరిపాలనా పరమైన ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన కొందరు అనుచరుల్లో కనిపిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్న కొండా వర్గానికి చెందిన నేతల్లో టెన్షన్ నెలకొందన్న ప్రచారం సాగుతోంది. రాజకీయ సమీకరణాలు మారితే తమ పదవులపై ప్రభావం ఉంటుందేమోనని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కొండా సురేఖకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన కొందరు నేతలు కూడా ప్రస్తుతం కొంత దూరం పాటిస్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారంలో మారుతున్న పరిస్థితులను బట్టి రాజకీయంగా తమ భవిష్యత్‌ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ మౌనం కొనసాగుతోందన్న విశ్లేషణలు ఉన్నాయి.
* అనుచరుల ఏజెన్సీల పరిస్థేంటి ?
మరోవైపు, గతంలో కొండా వర్గానికి చెందిన అనుచరులకు కేటాయించిన కొన్ని ఏజెన్సీలు, ఇతర వ్యవహారాలపై కూడా అధికారుల దృష్టి పడుతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
* ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు
కొండా సురేఖ పదవి నుంచి తప్పుకోవడంతో వరంగల్ కాంగ్రెస్‌లోని ప్రత్యర్థి వర్గాలు రాజకీయంగా మరింత చురుగ్గా మారతాయని తొలుత భావించారు. కొందరు నేతలు తమ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు ప్రచారం జరిగింది. కొండా రాజకీయ ప్రభావం తగ్గితే కొత్త సమీకరణాలకు అవకాశం ఉంటుందని భావించిన పలువురు కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ లెక్కలు వేసుకున్నట్లు తెలుస్తోంది.
* గుండు సుధారాణికి పదవి కేటాయింపుపై సీనియర్ల అసంతృప్తి ?
అయితే గుండు సుధారాణికి కీలక కుడా చైర్ పర్సన్ పదవి కేటాయించిన తర్వాత పరిస్థితుల్లో మార్పు కనిపించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు పదవి దక్కడంతో కొందరు నేతలు తమ రాజకీయ వ్యూహాలను వెనక్కి తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో గుండు సుధారాణికి పదవి కేటాయింపుపై కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.
* కొత్త రాజకీయ సమీకరణలు
కాంగ్రెస్ రాజకీయాలు బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కొత్త రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొండా వర్గం భవిష్యత్ ఏంటి ? నామినేటెడ్ పదవుల్లో మార్పులు ఉంటాయా ? కాంగ్రెస్‌లో కొత్తగా ఎవరి ప్రభావం పెరుగుతుంది ? అన్న ప్రశ్నలు ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
కొండా సురేఖ బర్తరఫ్‌తో మొదలైన రాజకీయ ప్రకంపనలు.. వరంగల్ కాంగ్రెస్‌లో ఎలాంటి కొత్త సమీకరణాలకు దారి తీస్తాయన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
