Minister Seethakka criticized BRS and BJP
* వ్యక్తిగత దూషణలు, కించపరిచే పోస్టర్లను సహించేది లేదు
– మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్,ములుగు:
పలు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకుని బీఆర్ఎస్ నానాజాతి సమితిగా మారిందని, ఆపార్టీ కాంగ్రెస్ను ‘పచ్చ కాంగ్రెస్’ అంటూ విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మండిపడ్డారు. టీడీపీ నుంచి వచ్చిన నాయకులతో బీఆర్ఎస్ నిండిపోయినప్పుడు ఆ పార్టీని కూడా ‘పచ్చ పార్టీ’ అనాలా అని ప్రశ్నించారు.
గురువారం ములుగు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ ఇతర పార్టీల నాయకుల గురించి మాట్లాడే ముందు తన పార్టీ చరిత్రను ఒక్కసారి చూసుకోవాలని మంత్రి సూచించారు. బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు లేరా అని ప్రశ్నించారు. మీ పార్టీలోకి వస్తే పవిత్రులు, పక్క పార్టీలోకి వెళితే అనైతికులా అని ప్రశ్నించారు. ఇదేనా మీ రాజకీయ సంస్కారం అని నిలదీశారు.
కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఏ పార్టీ నుంచి ప్రారంభమైందో గుర్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక రోడ్లపైకి వచ్చి నిరసనల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం మీకు ఉందా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల కడుపు నింపే విధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు లక్ష ఇళ్లు ఇవ్వలేకపోయారని, ప్రజా ప్రభుత్వం తొలి దశలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు. ప్రతి అర్హుడైన పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
తమ ప్రభుత్వం రైతులకు సన్నవడ్లకు బోనస్ ఇచ్చి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, అదే సన్నబియ్యాన్ని పేదల కుటుంబాలకు పంపిణీ చేస్తోందని చెప్పారు. తమ నాయకులను, ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరిచేలా పోస్టర్లు వేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మా కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. మేము సహనంతో ఉన్నామని చేతకానితనంగా భావించవద్దు. మా కార్యకర్తల సహనం కోల్పోతే నష్టం మీకే జరుగుతుంది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని పాడు చేయాలని చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగానే గట్టిగా సమాధానం చెబుతాం” అని మంత్రి సీతక్క హెచ్చరించారు.
ఈ సమావేశంలో ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముశినేపల్లి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ జక్కుల రేవంత్ యాదవ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
