Progressive Panel Producers Council Manifesto release
* నిర్మాతలకు ఏటా రూ.50 లక్షల వైద్య సహాయనిధి
* సెప్టెంబర్ 6న నిర్మాతల మండలి ఎన్నికలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 6న ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానల్ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే అధ్యక్షుడిగా సి. కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. మిగతా పోస్టులకు పోటీ నెలకొంది. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తామని నిర్మాతలు దామోదర్ ప్రసాద్, నటుడు అశోక్ కుమార్ తెలిపారు. నిర్మాతలకు వైద్య భద్రత, అత్యవసర సహాయం అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు.
* తక్షణ వైద్య సహాయం
నిర్మాతలకు వెంటనే రూ.5 లక్షల క్యాష్‌లెస్ మెడికల్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రోగ్రెసివ్ ప్యానల్ ప్రకటించింది. అలాగే ఏటా రూ.50 లక్షల వైద్య సహాయనిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మండలిలోని 306 మంది సభ్యులకు ఒకేసారి కనీస ఫీజుతో లైఫ్ మెంబర్షిప్ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త నిర్మాతలను ప్రోత్సహించడంతో పాటు సింగిల్ విండో విధానంలో హెల్ప్ డెస్క్, కంటెంట్ ఫెసిలిటేషన్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మహిళా సభ్యుల భద్రత కోసం కౌన్సిల్ తరఫున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, కార్మిక సంఘాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తామని ప్యానల్ సభ్యులు తెలిపారు. నిర్మాతలకు నిత్యం అందుబాటులో ఉంటామని, ప్రతి నెల నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ-లెటర్ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తామని చెప్పారు.
* పైరసీపై 24 గంటల నిఘా
వీపీఎఫ్, డిజిటల్ ప్రొటెక్షన్‌కు సంబంధించిన ఆర్థిక భారాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాంటీ పైరసీ టాస్క్‌ఫోర్స్‌ను 24 గంటలు అందుబాటులో ఉంచి, పైరసీని అరికట్టే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.
* సామాన్య ప్రేక్షకుడికి థియేటర్ భారం తగ్గేలా..
ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించేందుకు కృషి చేస్తామని ప్యానల్ ప్రకటించింది. ఆన్లైన్ టికెటింగ్‌లో అధికంగా వసూలు చేస్తున్న కన్వీనియన్స్ ఫీజులు, మల్టీప్లెక్స్‌లలో సామాన్య ప్రేక్షకులకు భారంగా మారిన ఆహార, పానీయాల ధరలపై ప్రభుత్వ శాఖలతో చర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
* వ్యాఖ్యలపై అశోక్ కుమార్ ఆగ్రహం
తమ ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న కొందరు నిర్మాతలను ‘చీడ పురుగులు’గా వ్యాఖ్యానించడం సరికాదని అశోక్ కుమార్ అన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కనీసం సభ్యుల జాబితా కూడా ఇవ్వలేదని, ఇలాంటి పరిస్థితుల్లోనే తాను కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఈ పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో ఆర్.కె., ముత్యాల రామాంజనేయులు, మైత్రి రవి, రవీంద్ర గోపాల్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
