KTR, KCR, Harish Rao, Shiv Pratap Shukla
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల బృందం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులపై జరుగుతున్న వరుస పరిణామాలను వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
* పోలీసుల తీరుపై ఫిర్యాదు
అసెంబ్లీ పరిసరాల్లో చోటుచేసుకున్న పరిణామాలు, తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు వివరించారు. ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించేందుకు వచ్చిన ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల ప్రవర్తన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. శాసనసభ్యులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, సభా ప్రాంగణంలో నిరసన తెలిపే సమయంలో పోలీసు బలప్రయోగానికి దిగారని ఫిర్యాదు చేశారు.
* కేసీఆర్‌పై దాడి కుట్ర ఆరోపణలు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై దాడి చేయడంతో పాటు ఆయన నివాసాన్ని ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం గవర్నర్‌కు విన్నవించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసు యంత్రాంగం వైఖరిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
* మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అనుచిత ప్రవర్తన
నిరసన సమయంలో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు తీవ్రంగా, అనుచితంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, భద్రతను కాపాడాల్సిన పోలీసులే దురుసుగా ప్రవర్తించడం పట్ల తక్షణమే స్పందించి, విచారణకు ఆదేశించాలని కోరారు.
* రాజకీయ కక్షసాధింపు
రాజకీయంగా ఎదుర్కోలేక తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రతిపక్ష గొంతును నొక్కేందుకు, తమ రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
*గవర్నర్ జోక్యానికి విజ్ఞప్తి
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, శాంతిభద్రతలు, రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడేందుకు గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ బృందం విజ్ఞప్తి చేసింది. ప్రజాప్రతినిధులకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించేలా ప్రభుత్వానికి, పోలీసు శాఖకు తగిన సూచనలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు తీవ్రతరమవుతున్న వేళ బీఆర్ఎస్ అగ్రనేతలు గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వినతిపత్రంపై రాజ్ భవన్ నుంచి ఎలాంటి స్పందన రానుందనేది ఆసక్తికరంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
