Thummala Nageswara Rao on Telangana Agriculture Education
* వ్యవసాయ విద్యలో సంచలన మార్పులు..
* అసెంబ్లీలో మంత్రి తుమ్మల కీలక ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ విద్యను బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభ వేదికగా వెల్లడించారు. అసెంబ్లీలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి పాయింట్ టూ పాయింట్ సమాధానం ఇస్తూ, అగ్రి పాలిటెక్నిక్ కాలేజీల ప్రక్షాళన మరియు కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుపై కీలక ప్రకటనలు చేశారు.
* ప్రమాణాలు లేని పాలిటెక్నిక్ కళాశాలలు రద్దు..
శాసనసభ్యుల సూచనలు, క్షేత్రస్థాయి విచారణ ఆధారంగా నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా లేని అగ్రి పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిందని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మరో నాలుగు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలను మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోందని, నిబంధనలు పాటించకపోతే వాటిని కూడా తక్షణమే క్యాన్సిల్ చేస్తామని స్పష్టం చేశారు.
* ఇక ‘స్కిల్ డెవలప్మెంట్’ కేంద్రాలు..
ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న నాలుగు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ఆధునిక సాంకేతికత, నైపుణ్య శిక్షణ అందించే విధంగా వీటిని పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు.
* ప్రొఫెసర్ల సర్దుబాటు..
గతంలో అగ్రి పాలిటెక్నిక్‌లలో 750 సీట్లు ఉండగా, ఆ తర్వాత 450 సీట్లకు తగ్గించినప్పటికీ విద్యార్థుల నుంచి ఆశించిన డిమాండ్ ఉండటం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని కళాశాలల్లో కేవలం 8 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే చేరుతున్నారని, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రొఫెసర్లను కేటాయించాల్సి వస్తోందన్నారు.
ఈ నేపథ్యంలో వనరులు వృథా కాకుండా కళాశాలలను సమన్వయం (Synchronize) చేసి, విద్యార్థులకు మరింత మెరుగైన విద్యనందించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
* జయశంకర్ వర్సిటీకి 19వ ర్యాంక్..
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం గతంలో 37వ ర్యాంకులో ఉండగా, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల స్వల్ప వ్యవధిలోనే 19వ ర్యాంకుకు మెరుగుపడిందని తెలిపారు.
ఈ వర్సిటీని దేశంలోనే 1వ ర్యాంకుకు తీసుకురావడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వర్సిటీకి అవసరమైన బోధనా సిబ్బంది (Teaching Staff) నియామకం, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. డిజిటల్ అగ్రికల్చర్, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలను (Innovations) ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
* కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలలు..
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అగ్రికల్చర్ కాలేజీలు లేని ప్రాంతాలను గుర్తించి, ఈ ఏడాదే మూడు కొత్త వ్యవసాయ కళాశాలలను మంజూరు చేశామని మంత్రి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా – హుజూర్ నగర్, నిజామాబాద్ జిల్లా – డిచ్పల్లి , వికారాబాద్ జిల్లా గతంలో రాష్ట్రవ్యాప్తంగా 1,100 అగ్రికల్చర్ సీట్లు మాత్రమే ఉండగా, ఈ కొత్త కాలేజీల ఏర్పాటుతో మొత్తం సీట్ల సామర్థ్యాన్ని 2,000కు పెంచినట్లు తెలిపారు.
* నియోజకవర్గాల విజ్ఞప్తులపై హామీ..
శాసనసభ్యులు భట్టి విక్రమార్క, లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ – రామ్‌సాగర్ పాలిటెక్నిక్), మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి లేవనెత్తిన స్థానిక సమస్యలు, విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మౌలిక వసతులు, నాణ్యమైన బోధనా సిబ్బందిని నియమించి తెలంగాణ విద్యార్థులకు ప్రపంచస్థాయి వ్యవసాయ విద్యను అందుబాటులోకి తెస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
