Palakurthi Film Shootings
అకేరు న్యూస్, పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గం సినీ చిత్రీకరణలకు ప్రధాన వేదికగా మారుతోంది. పచ్చని ప్రకృతి అందాలు, సహజసిద్ధమైన గ్రామీణ వాతావరణం, చారిత్రక గుట్టలు సినీ మేకర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం, ఇప్పుడు వర్ధమాన, అగ్ర సినీ నటుల షూటింగ్‌లతో సందడిగా మారుతోంది.
తాజాగా పాలకుర్తి మండల కేంద్రంలోని తిరుమల సినిమా హాల్ లో “ప్రొడక్షన్ నెంబర్ 1” (తాత్కాలిక పేరు) సినిమా చిత్రీకరణ ఘనంగా జరిగింది. కార్తీక్ రాజు, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, గాలి కృష్ణ, శ్రీరామ కృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తిరుమల థియేటర్లో ‘వేటగాడు’ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల మధ్య హీరో, హీరోయిన్ల సంభాషణకు సంబంధించిన కీలక సన్నివేశాలను కెమెరామెన్ చరణ్ ల్యాన్స్ లో బంధించారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ మేనేజర్లు సుబ్బారావు, మేడారపు సుధాకర్, సహాయకులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న భారీ చిత్రం “ఎల్లమ్మ” షూటింగ్ కూడా ఇక్కడే ప్రారంభం కానుంది. ‘బలగం’ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు వేణు, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులతో కలిసి కొండాపురం, కోలనపల్లి గుట్టలు, పర్వతగిరి పరిసర ప్రాంతాల్లో లొకేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్లు నచ్చడంతో వెంటనే సెట్ వర్క్‌ను కూడా ప్రారంభించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణ అధికారికంగా షురూ కానుంది.
పాలకుర్తి ప్రాంతంలో ఉన్న సహజ సిద్ధమైన లొకేషన్లు సినిమాలకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా సినీ షూటింగ్‌ల హబ్‌గా మారే అవకాశం ఉందని ప్రొడక్షన్ మేనేజర్ మేడారపు సుధాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
