MLA Venkata Ramana Reddy on Indiramma Housing Scheme
* అసెంబ్లీలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి నిలదీత
* అర్హులకే ఇళ్లు ఇవ్వాలి.. రాజకీయం వద్దు
* కామారెడ్డి ఎమ్మెల్యే డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ వేదికగా కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (కేవీఆర్) పలు కీలక అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ మంచి కార్యక్రమమని, పేదలకు ఇళ్లు అందుబాటులోకి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే ఈ పథకం అమలు, అర్హుల ఎంపిక, బడ్జెట్ అంచనాలు మరియు అసెంబ్లీ సమయం వినియోగంపై ఆయన తన అభిప్రాయాలను నిష్పాక్షికంగా వ్యక్తం చేశారు.
*కేంద్ర వాటా – సమీక్షా సమావేశం..
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన రూ. 72,000 వాటాపై ఇదివరకే మంత్రి మరియు అధికారుల సమక్షంలో రివ్యూ నిర్వహించారని కేవీఆర్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు (Norms) అనుగుణంగా ఉండే ఇళ్లకు గరిష్టంగా కేంద్ర షేరింగ్ దక్కేలా చూస్తామని ఆ రోజు మంత్రి మాట ఇచ్చారని, దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
* అర్హుల ఎంపికలో అభ్యంతరాలు..
వాహనాలు (ఫోర్ వీలర్లు, ఆటోలు, కార్లు) ఉన్నాయనే నెపంతో మార్జిన్ మనీ కట్టి ఫైనాన్స్‌లో కొనుగోలు చేసిన పేదలకు పథకాన్ని తిరస్కరించడం సరికాదని స్పష్టం చేశారు. తిండికి తిప్పలు పడే అసలైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు దక్కాలన్నారు. గతంలో వైఎస్సార్ లేదా కేసీఆర్ హయాంలో ఇళ్లు పొంది, వాటిని అమ్ముకుని మళ్లీ అప్లై చేసుకునే వారిని అరికట్టాలని సూచించారు. మైనార్టీ, బీసీ, ఎస్సీ అనే కులమతాల ప్రాతిపదికన కాకుండా కేవలం “అర్హులా? కాదా?” అన్నదే అర్హతగా చూడాలన్నారు.
*రూ. 5 లక్షల్లో ఇల్లు కట్టొచ్చు..
ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ. 5 లక్షలతో సాధారణ ఇల్లు కట్టడం సాధ్యమేనని, వర్షాకాలంలో ఇసుక రేట్లు పెరిగితే తప్ప రూ. 5 లక్షల నుంచి రూ. 5.50 లక్షల్లో ఇల్లు పూర్తవుతుందని పేర్కొన్నారు. అయితే లగ్జరీగా టైల్స్, ఫ్లైవుడ్ డోర్లు, ఎల్ఈడీ లైట్లతో రూ. 10 నుంచి 15 లక్షలు పెట్టి కట్టేవారు అసలైన అర్హులా కాదా అనేది ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన (Inspection) చేసి తేల్చాలని డిమాండ్ చేశారు.
*ఇందిరమ్మ కమిటీలు – గెజెట్ వెరిఫికేషన్..
ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీల ఆమోదం లేకపోవడం వల్ల ఆర్డీవోలు, కలెక్టర్లు గెజెట్ వెరిఫికేషన్ చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను స్వయంగా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న 300 నుంచి 350 మంది నిరుపేదల జాబితాను అధికారులకు సమర్పించినా ఇప్పటివరకు ఎలాంటి ఆమోదం లభించలేదని సభ దృష్టికి తెచ్చారు.
* డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి..
చివరగా, క్వశ్చన్ అవర్ (ప్రశ్నోత్తరాల సమయం) నిర్వహణపై స్పందిస్తూ.. ఉప ముఖ్యమంత్రిగారు గతంలో ఇచ్చిన మాట ప్రకారం క్వశ్చన్ అవర్‌ను కేవలం సలహాలు, సుదీర్ఘ ఉపన్యాసాలకే పరిమితం చేయకుండా, నేరుగా ప్రశ్నలు-సమాధానాల రూపంలో సమర్థవంతంగా నడిపించాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

