Ganesh Immersion Arrangements
* ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కీలక సూచనలు
ఆకేరు న్యూస్, హనుమకొండ: వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు. హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్లోని మినీ హాల్లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన వినాయక చవితి వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే నాయిని హాజరై నీటి వసతి, నిమజ్జన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
* నీటి లభ్యతపై కార్యాచరణ
తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో నిమజ్జనానికి అనువైన చెరువులు, నీటి వనరులను ముందుగానే గుర్తించాలని నాయిని సూచించారు. నీటిమట్టం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన మేరకు నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేయాలని, నిమజ్జనానికి అనువుగా ప్రత్యేక నిమజ్జన పాండ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
భారీ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా క్రేన్లు, ఇతర అవసరమైన పరికరాలను ముందుగానే సిద్ధం చేయాలని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
* బంధం చెరువు పనులు వేగవంతం చేయాలి
బంధం చెరువులో గుర్రపు డెక్క, పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే నాయిని సూచించారు. నిమజ్జనానికి ముందే చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేయాలని తెలిపారు.
* మండపాలకు ఉచిత విద్యుత్
నగరంలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని నాయిని సూచించారు. మండపాల విద్యుత్తు కనెక్షన్లు, వైరింగ్‌ను సంబంధిత అధికారులు ముందుగానే పరిశీలించాలని, షార్ట్‌సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండపాల పరిసరాల్లో ప్రతిరోజూ మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని నాయిని తెలిపారు. చెత్త తొలగింపు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
* శబ్ద కాలుష్య నిబంధనలు
వినాయక మండపాల సమీపంలో ఆలయం, పాఠశాల, చర్చి, మసీదు వంటి మతపరమైన లేదా విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాల్లో నిర్వాహకులకు ముందుగానే అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. శబ్ద వ్యవస్థ వినియోగంలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలగకుండా వేడుకలు నిర్వహించేలా అధికారులు నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.
* ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా..
వినాయక చవితి నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీస్, ట్రాఫిక్, జీడబ్ల్యూఎంసీ, విద్యుత్తు, ఆరోగ్య, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని నాయిని సూచించారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందుగానే రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకోవాలని, అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని, నిమజ్జన మార్గాల్లో ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
