* పంచాయతీల సొంత నిధుల వినియోగానికి కొత్త వెసులుబాటు
* వార్డు మెంబర్లకు నిర్దిష్ట బాధ్యతలు.. పరిశీలిస్తాం: సీతక్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్: పంచాయతీల సొంత నిధుల వినియోగానికి కొత్త వెసులుబాటు కల్పిస్తామని మంత్రి సీతక్క అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. శాసనసభలో ‘పంచాయతీరాజ్ సవరణ బిల్లు’పై జరిగిన చర్చలో ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
* నిధుల వెసులుబాటు
ఓన్ రీసోర్సెస్ ఫండ్ వాడుక: 2018 నాటి పంచాయతీరాజ్ చట్టంలో గ్రామాల సొంత నిధులకు ట్రెజరీ నిబంధనలు గొడ్డలిపెట్టుగా మారాయని మంత్రి తెలిపారు. చిన్న చిన్న మరమ్మతులకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. స్థానిక బ్యాంకుల్లో జమ: ప్రస్తుత సవరణ ద్వారా గ్రామ పంచాయతీ ఓన్ రీసోర్సెస్ (స్వంత నిధులు)ను నేషనలైజ్డ్ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల్లో జమ చేసుకునే అవకాశం కల్పించాం. గ్రామసభ తీర్మానం మేరకు స్థానిక అవసరాలకు ఖర్చు చేసుకునే స్వేచ్ఛ సర్పంచులకు లభిస్తుందని తెలిపారు.
* గ్రామీణ రోడ్లు – ‘పొలం బాటలు’ కార్యాచరణ
అక్టోబర్ తర్వాత ‘పొలం బాటలు’: అక్టోబర్ నెల తర్వాత రాష్ట్రంలో ‘పొలం బాటలు’ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని మంత్రి అసెంబ్లీకి తెలిపారు.
భారీ బడ్జెట్ కేటాయింపు: విబిజి రామ్ జీ (VBJG RAMG) పథకం కింద రాష్ట్రాంపై గతంలో రూ. 300 నుంచి 500 కోట్ల భారం ఉండగా, ప్రస్తుతం కేంద్ర నిబంధనల మార్పుతో రూ. 2,500 కోట్ల ఆర్థిక భారం పడుతోంది. అయినప్పటికీ, సీఎం, డిప్యూటీ సీఎంలు పల్లెల అభివృద్ధి కోసం వెనుకాడకుండా బడ్జెట్ కేటాయించారు.
కనెక్టివిటీకి ప్రాధాన్యం: మండలం నుంచి గ్రామానికి, తండాలు/గూడేల నుంచి పంచాయతీకి రోడ్డు కనెక్టివిటీ కోసం పంచాయతీరాజ్ నుంచి రూ. 7,000 కోట్లు, ఆర్ అండ్ బి, ఐటీడీఏల ద్వారా భారీగా నిధులు ఇస్తున్నామని అన్నారు.
* అటవీ ప్రాంత రోడ్ల సమస్యపై ప్రత్యేక దృష్టి
మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు, చెంచు పెంటలు, తండాల్లో గర్భిణులు, రోగులకు వైద్యం అందక ఎదురవుతున్న రవాణా కష్టాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ (ఫారెస్ట్) అభ్యంతరాలు ప్రధాన ఆటంకంగా మారాయని, త్వరలోనే కేంద్ర ఫారెస్ట్ మినిస్టర్ను కలిసి అటవీ అనుమతుల సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు.
* భవనాలు, బకాయిలు & సర్పంచుల నిధులు
పంచాయతీ సొంత భవనాలు: ఉపాధి హామీ (NREGS) ద్వారా ఇప్పటికే 9,000 వీవో (VO) భవనాలు, అంగన్వాడీ భవనాలు నిర్మించాం. ఇకపై అద్దె భవనాలు లేకుండా సొంత గ్రామ పంచాయతీ భవనాలను నిర్మిస్తాం. కోర్టు కేసుల గ్రామాల నిధులు: ఏజెన్సీ ప్రాంతాల్లో కోర్టు కేసుల వల్ల ఎన్నికలు జరగని 52 గ్రామ పంచాయతీలకు నిధులు ఆగకుండా రూ. 3 కోట్ల రూపాయల మంత్లీ నిధులను విడుదల చేస్తూ జీవో ఇచ్చామని తెలిపారు. పంచాయతీరాజ్, MLA, MP, SDF నిధులను వర్గీకరించే ప్రక్రియ (Segregation) ముగిసాక, అర్హత ఉన్న బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. జీతాల చెల్లింపులు: మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రతి నెలా 1వ తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.