Telangana Assembly
* 22-Aపై కీలక చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా 22-A నిషేధిత భూముల జాబితా అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22-Aపై సభలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 22-A జాబితాలో భూముల చేర్పులు, తొలగింపులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించే అవకాశం ఉంది.
* స్వల్పకాలిక చర్చలో సీఎం వివరణ..
22-A అంశంపై జరిగే స్వల్పకాలిక చర్చలో సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్లారిఫికేషన్ ఇవ్వనున్నారు. భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించే అవకాశం ఉంది. ఇటీవల 22-A భూముల అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చివరి రోజు అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. భూముల రిజిస్ట్రేషన్లు, నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు వంటి అంశాలపై ప్రభుత్వం ఏ విధమైన స్పష్టత ఇస్తుందన్నది కీలకంగా మారింది.
* కీలక అంశాలపై చర్చ..
సమావేశాల చివరి రోజున 22-Aతో పాటు ఇతర ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చకు అవకాశం ఉండటంతో అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ శాసనసభ ప్రస్తుతం 119 మంది సభ్యులతో కూడిన ద్విసభ్య శాసన వ్యవస్థలోని దిగువ సభగా కొనసాగుతోంది. 22-Aపై మంత్రి పొంగులేటి ప్రజెంటేషన్.. ఆ తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఇచ్చే వివరణతో భూ సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇస్తుందోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
