Jagtial BRS Leader Suicide
* సూసైడ్ నోట్ రాసి బీఆర్ఎస్ నేత ఆత్మహత్య
* రూ. 15 లక్షల అప్పుల భారం తాళలేక..
ఆకేరు న్యూస్, జగిత్యాల : ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న అప్పుల భారం తాళలేక బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా ఎండ్పల్లి మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సింహాచలం జగన్ (42) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్/ఎండ్పల్లి పరిధిలో తీవ్ర విషాదాన్ని నింపింది.
* సంఘటన వివరాలు..
వృత్తిరీత్యా ఆర్ఎంపీ (RMP) వైద్యుడైన సింహాచలం జగన్, గతంలో సర్పంచ్‌గా సేవలందించారు. దశాబ్ద కాలంగా ఉమ్మడి వెల్గటూర్, ఎండ్పల్లి మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలు, కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆయన సుమారు రూ. 15 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో సరైన ఆదాయం లేకపోవడం, మరోవైపు ఈఎంఐలు, అప్పుల భారం రోజురోజుకు పెరిగిపోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఈ క్రమంలోనే శనివారం తన నివాసంలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
* కలచివేస్తున్న సూసైడ్ నోట్..
చనిపోయేముందు జగన్ రాసిన సూసైడ్ నోట్ స్థానికులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. “నా కుటుంబాన్ని ఆదుకోవాలి.. పల్లవి నన్ను క్షమించు.. పిల్లలు సంజన, సుధాంశ్ను జాగ్రత్తగా చూసుకో” అని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. బాధితుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్గటూర్ ఎస్ఐ ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా, బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
