Konda Family Political Meeting
* కార్యకర్తలతో కీలక భేటీ
* బర్తరఫ్ తర్వాత తొలిసారి సమావేశం
* హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ
ఆకేరు న్యూస్, వరంగల్ : మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తమ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయిన తర్వాత తొలిసారిగా వరంగల్ కార్యకర్తలు, అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో జరగనున్న ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తల అభిప్రాయాలను కొండా దంపతులు తెలుసుకోనున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఈ సమావేశాన్ని వర్షం ఇంటి వద్ద నిర్వహించాలని భావించినప్పటికీ.. వర్షం కారణంగా వేదికను ఓ హోటల్‌కు మార్చినట్లు తెలుస్తోంది. కొండా దంపతులకు సన్నిహితంగా ఉండే ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుచరులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
* సురేఖకు కేబినెట్ స్థాయి పదవిపై ప్రచారం..
ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు కేబినెట్ స్థాయి పదవి ఇచ్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సురేఖకు భవిష్యత్‌లో ఎలాంటి బాధ్యత అప్పగించాలనే అంశంపై హైకమాండ్ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
* సమావేశం తర్వాత ఢిల్లీకి..?
వరంగల్‌లో కార్యకర్తలు, అనుచరులతో సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పార్టీ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే ఢిల్లీ పర్యటనపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
కేబినెట్ నుంచి బర్తరఫ్ తర్వాత కొండా దంపతులు నిర్వహిస్తున్న తొలి కీలక సమావేశం కావడంతో.. ఈ భేటీలో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? కార్యకర్తలకు ఏం చెబుతారు? భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
