Greenfield Highway Accident
* లారీని ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పిన కారు
* ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, ఖమ్మం : గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఓవర్టేక్ చేస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగింది.
స్థానికుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపాడు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు షాపింగ్ కోసం ఖమ్మం వెళ్లారు. అనంతరం కారులో తిరిగి దేవరపల్లి వైపు వెళ్తున్నారు. ముత్తగూడెం సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనపై పెనుబల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఎర్రగుంటపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
