Warangal CGHS Wellness Center
* 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
* పెన్షనర్లకు వైద్య సేవలు
Warangal CGHS: ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ నగరంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు వేగవంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చొరవ తీసుకున్నారు. దీపావళి నాటికి వెల్నెస్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ప్రతిపాదిత భవనాల పరిశీలన
CGHS, కేంద్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ పర్వీన్ బాలా, వైద్య బృందంతో కలిసి ఎంపీ కడియం కావ్య సోమవారం కేయూ క్రాస్ సమీపంలోని ఆకాశవాణి రేడియో స్టేషన్ ప్రాంగణంలోని ప్రతిపాదిత భవనాలను పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు భవనం అనుకూలత, మౌలిక వసతులు, అవసరమైన సదుపాయాలపై అధికారులు వివరాలు సేకరించారు.
ఆర్థిక అనుమతిపై ఎంపీ చొరవ
వరంగల్‌లో CGHS వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన కేంద్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖలో ఆర్థిక అనుమతి కోసం పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ కడియం కావ్య ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని కలిసి అనుమతులను త్వరగా మంజూరు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర అధికారుల బృందం వరంగల్‌కు వచ్చి ప్రతిపాదిత భవనాలను పరిశీలించింది.
దీపావళి నాటికి సేవలు
వెల్నెస్ సెంటర్ పనులను వేగవంతం చేసి దీపావళి నాటికి వైద్య సేవలు ప్రారంభించాలని ఎంపీ అధికారులను కోరారు. అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు, మందులు, ఇతర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం తన ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కడియం కావ్య తెలిపారు.
12 వేల మందికి ప్రయోజనం
వరంగల్‌లో CGHS వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి వస్తే వరంగల్, హనుమకొండతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం CGHS వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్న వారికి వరంగల్‌లోనే సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం, ఖర్చు తగ్గనుంది.

కార్పొరేట్ స్థాయి వైద్య సేవలే లక్ష్యం
వెల్నెస్ సెంటర్‌ను కేవలం ప్రాథమిక వైద్య సేవలకే పరిమితం చేయకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీ తెలిపారు. ఓపీ సేవలతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు, వివిధ చికిత్సలు అందుబాటులోకి తీసుకురానున్నారు. అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక వైద్యం, శస్త్రచికిత్సల కోసం ఎంప్యానెల్ ఆసుపత్రులకు రిఫరల్ సదుపాయం కల్పించనున్నారు.
మెడికవర్, రెనోవాతో అనుబంధం
ఇప్పటికే మెడికవర్, రెనోవా ఆసుపత్రులతో ఎంప్యానల్మెంట్/అనుబంధ ప్రక్రియ కొనసాగుతోందని ఎంపీ కడియం కావ్య తెలిపారు. దీంతో CGHS లబ్ధిదారులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
