Munigela Ramesh
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే హక్కు బీజేపీకి లేదని సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ అన్నారు. సోమవారం రంగరాయగూడెం, కోమటిగూడెం గ్రామాల్లో నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
నిజాం నిరంకుశ పాలనతో పాటు దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన పోరాటంలో కమ్యూనిస్టులు ప్రజలను సంఘటితం చేసి ముందుండి నడిపించారని రమేష్ తెలిపారు. ప్రజలు వెట్టిచాకిరీ, దోపిడీ, చిత్రహింసలకు గురవుతున్న సమయంలో ఆర్ఎస్ఎస్కు చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా రైతాంగ పోరాటంలో పాల్గొనలేదని విమర్శించారు.
మత ఘర్షణ కాదు.. ప్రజా పోరాటం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ–ముస్లిం ఘర్షణ కాదని, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పేదలు, రైతులు, కూలీలు సాగించిన ప్రజా పోరాటమని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను చెరిపివేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని అన్నారు.
భూమి, భుక్తి, విముక్తి కోసం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చింది కమ్యూనిస్టులేనని పేర్కొన్న రమేష్.. పోరాట ఫలితంగా తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పంచబడిందని, సుమారు 3,000 గ్రామాలు గ్రామ రాజ్యాలుగా ఏర్పడ్డాయని తెలిపారు. ఈ పోరాటంలో 4,000 మంది అమరులయ్యారని గుర్తు చేశారు.
17న జనగామలో సాయుధ పోరాట సభ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ సీపీఎం నేటికీ ప్రజా సమస్యలపై పోరాడుతోందని రమేష్ తెలిపారు. చరిత్రను వక్రీకరించి ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 17న జనగామ జిల్లా కేంద్రంలోని కామాక్షి ఫంక్షన్ హాల్లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని చెప్పారు. రైతులు, కూలీలు, కార్మికులు, యువత, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు, రంగరాయిగూడెం ఉపసర్పంచ్ మునిగే నరసింహులు, కోమటిగూడెం శాఖ కార్యదర్శి ఈదునూరి యాకయ్య, బోయినిగూడెం శాఖ కార్యదర్శి బోయిని రాజు, పార్టీ నాయకులు నెలమంచ వెంకటరెడ్డి, మారబోయిన మల్లయ్య, బోయిని రాజయ్య, మంద ఇలిషన్, జిల్లపెళ్లి కొమురయ్య, రాడపాక యాదగిరి, మల్లారెడ్డి, బోయిని కుమార్, పల్లెపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
