Telangana Praja Palana Dinotsavam
* ప్రజాపాలన దినోత్సవం.. ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తికి నిదర్శనం
* టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
ఆకేరు న్యూస్, హనుమకొండ :సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంత స్వాతంత్య్ర, విముక్తి చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్లో టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సీఎండీ మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు.
నిజాం పాలన, భూస్వామ్య వ్యవస్థలు, రజాకార్ల అకృత్యాల మధ్య కూడా తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని వదులుకోకుండా ధైర్యంగా నిలబడ్డారని గుర్తు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ నాగ్‌పూర్‌లో నిర్వహించిన ముఖ్యమైన సమావేశాలకు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని, తద్వారా వారిలో జాతీయ భావం మరింత బలపడిందని తెలిపారు. కమ్యూనిస్టులు గ్రామగ్రామాన తిరుగుతూ జానపద గేయాలు, కథల ద్వారా ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించారని పేర్కొన్నారు.
* పోరాట స్ఫూర్తికి ప్రతీక తెలంగాణ..
నిజాం పాలన, రజాకార్ల దౌర్జన్యాల కాలంలో తెలంగాణ తీవ్ర పేదరికం, నిరక్షరాస్యతతో బాధపడిందని సీఎండీ తెలిపారు. ప్రజలు ప్రధానంగా ఒకే పంటపై ఆధారపడి జీవించేవారని చెప్పారు. కరువు పరిస్థితుల్లోనూ పంటలో మూడో వంతుకు సమానమైన భూమిశిస్తును వసూలు చేయడంతో పాటు పంటలను కూడా స్వాధీనం చేసుకునేవారని, దీంతో ప్రజల విముక్తి పోరాటం మరింత తీవ్రతరమైందని వివరించారు.
1930, 1940 దశకాల్లో కమ్యూనిస్టులు, వివిధ ప్రజా సంఘాల నాయకత్వంలో గ్రామగ్రామాన విస్తరించిన విప్లవ స్ఫూర్తి తెలంగాణ ప్రాంత విముక్తి పోరాటానికి పునాది వేసిందన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన అధ్యాయమని పేర్కొన్నారు.
భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం స్వతంత్ర భారతదేశంలో విలీనం కావడానికి మరికొంత సమయం పట్టిందని తెలిపారు. దేశంలోని 562 సంస్థానాలు భారతదేశంలో విలీనం కాగా, హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్రంగా కొనసాగుతుందని నిజాం ప్రకటించారని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సమర్థవంతమైన నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా నిజాం పాలనకు ముగింపు పలికి, హైదరాబాద్ సంస్థానం భారత ప్రజాస్వామ్య సమాఖ్యలో అంతర్భాగంగా మారిందని వివరించారు.
ఎవరైనా ఆధిపత్యాన్ని అంగీకరించకుండా స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడే స్ఫూర్తి తెలంగాణ గడ్డలో లోతుగా పాతుకుపోయిందని సీఎండీ అన్నారు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉద్యోగులు తమ పని సంస్కృతిలోనూ ప్రతిబింబింపజేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే అమరవీరులకు, ప్రజల పోరాటాలకు సంస్థ అందించే నిజమైన నివాళి అని సీఎండీ స్పష్టం చేశారు. చారిత్రక పోరాట స్ఫూర్తితో ప్రతి ఉద్యోగి పునరంకిత భావంతో పనిచేస్తూ సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, పారదర్శకమైన, ప్రజా కేంద్రిత సేవలను అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి. తిరుపతిరెడ్డి, టి. మధుసూదన్, సి. ప్రభాకర్, సీవీఓ బోనాల కిషన్, చీఫ్ ఇంజినీర్లు కె. తిరుమలరావు, అశోక్, అన్నపూర్ణ, వెంకట రమణ, గౌతమ్‌రెడ్డి, మల్లికార్జున్, సీఎంలు చరణ్‌దాస్, కిషన్, కంపెనీ సెక్రటరీ కె. వెంకటేశం, జాయింట్ సెక్రటరీలు రమేష్, శ్రీకృష్ణ, జీఎంలు, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
