Telangana Liberation Day 2026 | CP Radhakrishnan
* పరేడ్ గ్రౌండ్లో ఘన వేడుకలు
* పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని చారిత్రక పరేడ్ గ్రౌండ్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, దేశభక్తి భావాల నడుమ ముగిశాయి. ఈ వేడుకలకు దేశభక్తి ఉప్పొంగుతుండగా, భారతదేశ ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
* వీర జవాన్లకు ఘన నివాళి..
ఈ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముందుగా ‘వీర సైనిక్ స్మారకం’ వద్దకు వెళ్లి అమరవీరులకు, వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన గొప్ప యోధులను, అమరుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.
*జాతీయ జెండా ఆవిష్కరణ..
అనంతరం పరేడ్ గ్రౌండ్ ప్రాంగణంలో ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకం ఎగరుతున్న వేళ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించి వంద సమర్పించారు.
*సాయుధ బలగాల కవాతు..
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) ఆధ్వర్యంలో నిర్వహించిన అద్భుతమైన కవాతును ఉపరాష్ట్రపతి తిలకించారు. కవాతు నిర్వహించిన దళాల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశ సమగ్రతను చాటేలా సాగిన ఈ బలగాల కవాతు అందరినీ ఆకట్టుకుంది.
*ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక ప్రదర్శనలు
ఈ వేడుకల్లో “హైదరాబాద్ విమోచనం” ప్రధాన ఇతివృత్తంగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ప్రత్యేక నృత్య రూపకాలు, ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఉమ్మడి పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టాయి. అలాగే, సాలార్జంగ్ మ్యూజియంలో నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలకు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతులు అందజేసి సత్కరించారు.
ఈ చారిత్రక కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు భారీ సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
