RIMS Fire Accident Kalvakuntla Kavitha Comments
* ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్ఎన్సీయూ)లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు శిశువులు మృతి చెందడంపై భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని పేర్కొన్నారు.
సోమవారం అర్ధరాత్రి రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీకి సంబంధించిన సమస్య తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం. దట్టమైన పొగలు వ్యాపించడంతో వార్డులోని శిశువులను సిబ్బంది అత్యవసరంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఐదు రోజుల శిశువు సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
* ప్రభుత్వంపై కవిత విమర్శలు..
ఈ ఘటనపై స్పందించిన కవిత.. రిమ్స్‌లో సరైన మౌలిక సదుపాయాలు లేవని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని ఆరోపించారు. గతంలో ‘జనంబాట’ కార్యక్రమంలో భాగంగా రిమ్స్ ఆస్పత్రిని సందర్శించినప్పుడు అక్కడి సౌకర్యాలపై తాము ప్రశ్నించామని తెలిపారు.
నిరుపేదలు, ఆదివాసీలు, గిరిజనులు, ఇతర సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించే రిమ్స్‌లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అప్పట్లోనే ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
* నిర్వహణపై దృష్టి పెట్టాలి..
రిమ్స్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్ పరికరాల నిర్వహణను క్రమం తప్పకుండా చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు.
ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా ప్రభుత్వం సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని, ఆస్పత్రుల్లో అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
* మృతుల కుటుంబాలకు సానుభూతి..
ప్రమాదంలో శిశువులను కోల్పోయిన తల్లులు, కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని వారి కుటుంబాలకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
