Minister Seethakka
* ఆయుర్వేద సేవలు పల్లెలకు చేరాలి: సీతక్క
Seethakka| ఆకేరు న్యూస్, ములుగు: ఆయుర్వేద వైద్య సేవలను మారుమూల గ్రామాల ప్రజలకు చేరువ చేయాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలు ఆయుర్వేద వైద్య సేవలను సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. వర్షాకాలం, రాబోయే రోజుల్లో వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న మారుమూల గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లాలని సూచించారు.
శిబిరాల తేదీలను ముందుగానే స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసి, ఎక్కువ మంది ప్రజలు సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 27న చిన్నబోయినపల్లిలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య బృందం పాల్గొనాలని కోరారు. ములుగు ఆసుపత్రికి పక్కా భవనాలు, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ములుగు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ములుగు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు లక్ష్మీనగర్‌లో పంచాయతీరాజ్ శాఖ నిధులు రూ.5.95 కోట్లతో నిర్మించిన ఈస్ట్ రోడ్డును ఆమె జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు.
పట్టణ విస్తరణకు అనుగుణంగా రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నట్లు సీతక్క తెలిపారు. బృందావనం కాలనీ, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో నివాసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలకు సౌకర్యంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.
ములుగు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో మంజూరైన పనులను పూర్తి చేయడంతో పాటు, మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత పెరిగిన అవసరాలకు అనుగుణంగా కొత్త అభివృద్ధి ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్యాటక, వైద్య, రవాణా సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. రూ.15 కోట్లతో అథ్లెటిక్ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ బానోత్ రవిచందర్, స్థానిక కౌన్సిలర్లు, వైద్య బృందం, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
