DPO Katakam Kalpana
* డీపీవో కటకం కల్పన
DPO Katakam Kalpana| ఆకేరు న్యూస్, రాయపర్తి: పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కటకం కల్పన అన్నారు. ‘స్వచ్ఛత హి సేవా’ వారోత్సవాల్లో భాగంగా తిరుమలాయపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీపీవో కల్పన మాట్లాడుతూ.. సమాజంలో మంచి మార్పు పాఠశాల స్థాయి నుంచే ప్రారంభం కావాలని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తరగతి గదులు, పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు.
ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను ఆమె వివరించారు. ఇళ్లలో, గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా తల్లిదండ్రులు, ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యార్థినులకు సూచించారు. అనంతరం పరిశుభ్రతను పాటిస్తూ స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగస్వాములవుతామని విద్యార్థినులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి కవిత, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ బరిగేల బాబు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, పంచాయతీ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
