Shadow Commissioner
* ఉద్యోగ సంఘం నేత తీరుపై ఆరోపణలు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనరేట్‌లో ఓ ఉద్యోగ సంఘం నేత వ్యవహారశైలిపై వైద్య వర్గాల నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి కీలక పరిపాలనా హోదా లేకపోయినా.. కమిషనర్ కార్యాలయంలో కీలక వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొందరు వైద్యులు ఆయనను ‘షాడో కమిషనర్’గా అభివర్ణిస్తున్నారు.
* అధికారిక హోదా లేకుండానే పెత్తనం..
కమిషనర్ కార్యాలయంలో సదరు ఉద్యోగ సంఘం నేతకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక పోస్టింగ్ లేదని ఆరోపణలు ఉన్నాయి. నోడల్ ఆఫీసర్, జాయింట్ కమిషనర్ వంటి పరిపాలనా హోదా కూడా లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ సీనియారిటీ జాబితాలు, బదిలీలు, పదోన్నతులు తదితర పరిపాలనా వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
* కీలక సమావేశాల్లో హాజరుపై అభ్యంతరాలు..
టీవీవీపీకి సంబంధించిన శాఖాపరమైన సమీక్షలు, ఉన్నతాధికారుల సమావేశాల్లోనూ సదరు నేత హాజరవుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. హెచ్వోడీలు, సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశాల్లో అధికారిక పరిపాలనా హోదా లేని వ్యక్తి ఎలా పాల్గొంటున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై కొందరు సీనియర్ అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
* కమిషనర్ లేకపోవడమే కారణమా..
టీవీవీపీకి పూర్తిస్థాయి రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో పరిపాలనా వ్యవహారాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైద్య వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని కొందరు అనధికార వ్యక్తులు ఫైళ్ల కదలికలను ప్రభావితం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ఉద్యోగ సంఘం నేత లేదా టీవీవీపీ అధికారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.
* కమిషనర్‌ను నియమించాలని డిమాండ్..
లక్షలాది మంది పేదలకు వైద్య సేవలు అందించే టీవీవీపీ వంటి కీలక వ్యవస్థలో పరిపాలన పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయి రెగ్యులర్ కమిషనర్‌ను నియమించి, కమిషనరేట్‌లో అధికారిక హోదాలు, బాధ్యతలు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే అధికారిక బాధ్యతలు లేని వ్యక్తుల అనధికార జోక్యానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
