Charminar Plaster Falling
* తప్పిన పెను ప్రమాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద పెచ్చులు ఊడిపడటంతో ఆందోళన నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన చార్మినార్ నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటి అంతస్తులో మరమ్మతులు జరుగుతున్న ప్రాంతం నుంచి పువ్వుల ఆకారంలో ఉన్న పెచ్చులు ఊడిపోయి కింద పడినట్లు సమాచారం.
రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ సమయంలో పర్యాటకులు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే చార్మినార్ లాంటి చారిత్రక కట్టడం నుంచి పెచ్చులు ఊడిపడటం పట్ల పర్యాటకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే గతంలో చార్మినార్‌లోని మక్కా మసీదు వైపు పెచ్చులు ఊడిపడిన ఘటన చోటుచేసుకుంది. మరోసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపు కూడా పెచ్చులు ఊడిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా మరోసారి పెచ్చులు ఊడిపడటంతో చార్మినార్ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు సందర్శించే చార్మినార్ విషయంలో పురావస్తు శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. చారిత్రక కట్టడం భద్రత, మరమ్మతులు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
