Ganesh immersion Warangal
* అధికారులకు సీపీ, కమిషనర్ ఆదేశాలు
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద కొనసాగుతున్న గణేశ్ నిమజ్జన ప్రక్రియను వరంగల్ సీపీ శ్వేత, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న గురువారం ఉదయం పరిశీలించారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లు, భక్తుల రాకపోకలు, భద్రత, పారిశుద్ధ్య చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇప్పటివరకు ఎన్ని గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.. ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా భక్తులు, ఉత్సవ నిర్వాహకులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిమజ్జనం కోసం వచ్చే విగ్రహాలను సాధ్యమైనంత త్వరగా నిమజ్జన కేంద్రాలకు తరలించి ప్రక్రియను పూర్తి చేసేలా ఉత్సవ కమిటీలు, నిర్వాహకులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సీపీ శ్వేత, కమిషనర్ వెంకన్న ఆదేశించారు. పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తి చేయాలని సూచించారు.
మరోవైపు నిమజ్జనం పూర్తైన వెంటనే విగ్రహాల అవశేషాలు, ఇతర వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని కమిషనర్ వెంకన్న ఆదేశించారు.ఈ పరిశీలనలో జీడబ్ల్యూఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
