Fake Fertilizer Racket
* 513 బస్తాలు సీజ్, ఇద్దరి అరెస్ట్
ఆకేరు న్యూస్, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూర్‌లో భారీ స్థాయిలో నకిలీ ఎరువులను తయారు చేస్తున్నారు. ఆ ముఠా గుట్టును వ్యవసాయ అధికారులు, పోలీసులు రట్టు చేశారు.
ప్రముఖ కంపెనీల పేర్లతో అక్రమంగా ఎరువులు తయారు చేసి విక్రయిస్తున్న స్థావరంపై దాడి చేసి, రూ. 20 లక్షల విలువైన 513 బస్తాల నకిలీ ఎరువులతో పాటు భారీగా ముడిసరుకును సీజ్ చేశారు.
*బ్రాండెడ్ పేరు.. నకిల ఎరువులు
రంగారెడ్డి జిల్లాలోని కుంట్లూర్ ఉషోదయ కాలనీలోని ప్లాట్ నంబర్లు 43, 54లను అద్దెకు తీసుకున్న మణినాయక్ అనే వ్యక్తి, ఎటువంటి అనుమతులు లేకుండా నకిలీ ఎరువుల తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు.
ఉప్పు, రెడ్ ఆక్సైడ్ ఉపయోగించి మురియేట్ ఆఫ్ పొటాష్, గుర్తుతెలియని గుళికలతో డీఏపీ కాంపౌండ్ ఎరువులను తయారు చేయిస్తున్నాడు. వీటిని బ్రాండెడ్ కంపెనీల సంచుల్లో నింపి, ఎరువుల దుకాణాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నాడు. పేరు బ్రాండెడ్ ఉండడంతో అసలైన ఎరువులే అనుకుని కొనుగోలు చేస్తున్నారు.
* అధికారుల ఆకస్మిక దాడులు
నకిలీ దందాపై పక్కా సమాచారం అందుకున్న జిల్లా వ్యవసాయ అధికారి ఎం. సుజాత, ఇబ్రహీంపట్నం ADA శశిధర్‌రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ ఏఎంఏఈఓ పల్లవి తమ సిబ్బందితో కలిసి హయత్‌నగర్ పోలీసుల సహాయంతో సదరు కేంద్రంపై వరుస దాడులు నిర్వహించారు.
రెండు రోజుల పాటు సాగిన ఈ తనిఖీల్లో 302 బస్తాల ఎంఓపీ, 121 బస్తాల కాంప్లెక్స్ ఎరువులు, 90 బస్తాల డీఏపీ మొత్తంగా 513 బస్తాలను, తయారీకి సిద్ధంగా ఉన్న ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* ఒకరి పరారీ.. ఇద్దరి అరెస్ట్..
ఈ దాడుల్లో ముఠా నిర్వాహకుడు మణినాయక్తో పాటు కోయ్యలగూడెంకు చెందిన సహాయకుడు రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కర్ణాటకకు చెందిన కృష్ణకుమార్ పరారీలో ఉన్నాడు. స్వాధీనం చేసుకున్న నకిలీ ఎరువుల శాంపిళ్లను నాణ్యతా పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.
వ్యవసాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతులకు నకిలీ ఎరువులు అమ్మినా, అనుమతి లేకుండా వ్యాపారం చేసినా కఠిన చర్యలు తప్పవని జేడీఏ సుజాత హెచ్చరించారు. రైతులు కేవలం గుర్తింపు పొందిన డీలర్ల వద్దే ఎరువులు కొనుగోలు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
