Ganesh immersion
* రెండు దశాబ్దాల భక్తి ప్రయాణం
* అత్తాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ కు కాలినడకన
* శ్రీహరి కుటుంబం అరుదైన నిమజ్జన దీక్ష!
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంటేనే కోలాహలం, డప్పు చప్పుళ్లు, వాహనాల రద్దీ కనిపిస్తాయి. కానీ, అత్తాపూర్‌కు చెందిన శ్రీహరి కుటుంబం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా, అత్యంత నిష్టతో ఒక అరుదైన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ ఇంట్లోనే భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించిన గణనాథుడిని సాగర్ తీరానికి చేర్చేందుకు వారు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.
ఎలాంటి వాహనాలను ఆశ్రయించకుండా, ఏకంగా అత్తాపూర్ నుంచి ట్యాంక్ బండ్ హుస్సేన్‌సాగర్ వరకు కుటుంబ సభ్యులందరూ కలిసి కాలిబాటనే నడుచుకుంటూ వెళ్తున్నారు.
* 26 ఏళ్లుగా అదే ఆనవాయితీ
గత 26 సంవత్సరాలుగా ఇదే ఆనవాయితీని ఏమాత్రం విస్మరించకుండా శ్రీహరి కుటుంబం కొనసాగిస్తుండటం విశేషం. ఏటా నిమజ్జన రోజున ఉదయాన్నే పూజా కార్యక్రమాలు ముగించుకుని, స్వామివారి విగ్రహాన్ని తమ భుజాలపై లేదా ప్రత్యేక బండిపై ఉంచి కాలినడకన బయలుదేరుతారు.
అత్తాపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ నడక ప్రయాణంలో దారి పొడవునా భక్తి భావంతో గణేష్ నామస్మరణ చేస్తూ సాగుతారు. వాహనాల హారన్ల శబ్దాలకు దూరంగా, కేవలం భక్తి మార్గంలో సాగే ఈ ప్రయాణం తమకు అలసటను ఇవ్వకపోగా అపారమైన మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుందని శ్రీహరి కుటుంబ సభ్యులు సంతోషంగా చెబుతున్నారు.
* మరోవైపు వేడుకల వీక్షణం
ఇలా కాలినడకన రావడం ద్వారా జంట నగరాల్లో జరుగుతున్న నిమజ్జన వేడుకను వీక్షించే అవకాశం కూడా దక్కుతుందని శ్రీహరి కుటుంబం చెబుతోంది. దారి పొడవునా భారీ క్రేన్లు, విద్యుత్ కాంతుల అలంకరణలు, భక్తుల కోలాహలం నడుమ సాగే సామూహిక నిమజ్జన వేడుకలను ప్రత్యక్షంగా తిలకించడం ఏటా ఒక మధురానుభూతిని పంచుతుందని పేర్కొంటున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
