Renigunta Railway
* నవంబరు 10 నుంచి పలు రైళ్ల రద్దు
ఆకేరు న్యూస్, తిరుపతి : రేణిగుంట రైల్వేస్టేషన్ యార్డు ఆధునీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నవంబరు 10 నుంచి డిసెంబరు 27 వరకు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నారు.
యార్డులో రైలు మార్గాల అనుసంధాన పనుల కారణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోనల్ అధికారి విజయకిషన్ తెలిపారు.
రేణిగుంట–నిశ్చింతపూర్ మధ్య నడిచే నాలుగు వస్తు రవాణా రైళ్లను రద్దు చేశారు. అలాగే కడప–అరక్కోణం, తిరుచానూరు–అరక్కోణం, చెన్నై–తిరుచానూరు, గూడూరు–రేణిగుంట, నెల్లూరు–రేణిగుంట మధ్య రోజువారీగా నడిచే ప్యాసింజర్ రైళ్లను 48 రోజుల పాటు రద్దు చేయనున్నారు.
చెన్నై–తిరుపతి మధ్య ప్రతిరోజూ నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను 27 రోజుల పాటు రద్దు చేశారు. తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట నుంచి రాకపోకలు సాగించే మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నిర్ణీత తేదీల్లో రద్దు చేయనున్నారు.
తిరుపతి–విశాఖపట్నం మధ్య వారంలో మూడు రోజులు నడిచే డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబరు 9 నుంచి 26 వరకు పలు తేదీల్లో రద్దు చేశారు. తిరుచానూరు నుంచి నాందేడ్, జాల్నా, కాచిగూడ, చర్లపల్లి మధ్య నడిచే వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా రెండు రోజుల పాటు రద్దు చేయనున్నారు.
రేణిగుంట–మైసూరు ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబరు 11, 12, 18, 19, 25, 26 తేదీల్లో రద్దు చేశారు. తిరుపతి–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబరు 12, 13, 14, 19, 20, 21, 26, 27 తేదీల్లో రద్దు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
*73 ఎక్స్‌ప్రెస్ రైళ్ల దారి మళ్లింపు..
రేణిగుంట మీదుగా ముంబయి, హౌరా, దిల్లీ, కన్యాకుమారి, చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలకు నడిచే 73 ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించనున్నారు. వీటిలో కొన్ని రైళ్లు గుత్తి, ధర్మవరం మీదుగా, మరికొన్ని గూడూరు, పెరంబూరు మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.
రేణిగుంట నుంచి నిజాముద్దీన్‌కు పాల రవాణా చేసే దూద్ దురంతో రైలును కూడా దారి మళ్లించారు. ఈ రైలు రేణిగుంట నుంచి ఎర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు, విజయవాడ మీదుగా నిజాముద్దీన్‌కు వెళ్లనుంది.
రైల్వే యార్డు ఆధునీకరణ పనుల కారణంగా ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలకు అనుగుణంగా రైళ్ల రాకపోకల వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
