Etela Rajender
* రేవంత్ రెడ్డి సర్కార్‌పై ధ్వజం
Etela Rajender| ఆకేరు న్యూస్, మంచిర్యాల: తెలంగాణ సమాజంలో ఉద్యమ పౌరుషం, ఐక్యత మరోసారి పునరావృతం కావాల్సిన సమయం ఆసన్నమైందని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ జాతీయ నేత ఈటల రాజేందర్ అన్నారు. బరిగీసి పోరాడిన గడ్డపై రాజీపడి బతకడం తగదని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను అసలు, వడ్డీతో సహా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సీసీసీ కార్నర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి ధర్నా కార్యక్రమంలో ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
చీకట్లో సింగరేణి కార్మికుల జీవితాలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 40 రోజుల పాటు సమ్మె చేసి, రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికుల జీవితాలు నేడు చీకట్లో మగ్గుతున్నాయని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి అన్యాయం చేశాయని విమర్శించారు.
కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం
సింగరేణిలో ఒకప్పుడు 1.16 లక్షల మంది శాశ్వత కార్మికులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 39 వేలకు పడిపోయిందని ఈటల తెలిపారు. సుమారు 70 వేల మంది ఔట్సోర్సింగ్ కార్మికులపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అన్నారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో 48 భూగర్భ గనులు ఉండగా ప్రస్తుతం 24కి తగ్గాయని ఈటల పేర్కొన్నారు. బొగ్గు తవ్వకాల కాంట్రాక్టులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల సంస్థకు నష్టం జరుగుతోందని ఆరోపించారు.
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నాణ్యమైన బొగ్గు ప్రైవేట్ వ్యక్తులకు చేరుతోందని, 30 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దొంగతనం జరిగిందని ఆయన ఆరోపించారు. సింగరేణి ప్రాంతాల్లో రోడ్లు, కార్మికులకు భద్రతా పరికరాలు, మందుల కొరత ఉన్నప్పటికీ ఇతర కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, సీనియర్ నాయకులు కందుల సంధ్యారాణి, చొప్పరి వేణు, శ్రీహరి రెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్, సునీల్ రెడ్డి, ముఖేష్ గౌడ్, హేమాజీ, కొంపల్లి శ్రీనివాస్, కార్మిక నాయకులు శ్రీధర్ రెడ్డి, కిరణ్ కుమార్, బాపు రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
