Sandeep Kumar Jha
* రహదారి భద్రతపై సమీక్ష
* అనధికార పార్కింగ్‌ల తొలగింపు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జిల్లాలో రహదారి భద్రతను మరింత పటిష్టం చేసి, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణ, అనధికార పార్కింగ్లు, రహదారి సూచికలు, లైటింగ్, సర్వీస్ రోడ్లు, వాహనాల వేగ నియంత్రణ తదితర అంశాలపై అధికారులు సమీక్షించారు.
అనధికార పార్కింగ్‌ల తొలగింపు
జాతీయ రహదారి-163పై ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు, రహదారి సూచికల అప్‌గ్రేడేషన్, జనగామ పట్టణానికి సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కోమల్ల టోల్ ప్లాజా వద్ద అనధికార పార్కింగ్‌ను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. కరుణాపురం ప్రాంతంలోని మద్యం దుకాణాల వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించి, ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అనధికార పార్కింగ్‌ను కూడా తొలగించాలని ఆదేశించారు.
FOB పనులు వేగవంతం
స్టేషన్ ఘన్ పూర్, చిన్నపెండ్యాల, కరుణాపురం ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ రహదారులపై వాహనాల వేగ నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్, థర్మోప్లాస్టిక్ మార్కింగ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. జనగామ పట్టణ ప్రవేశ ప్రాంతంలో వేగ నియంత్రణకు సంబంధించిన బెల్ మార్క్‌ను సరిచేసి వాహనాల రాకపోకలకు అనుకూలంగా రహదారిని తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఎల్లమ్మ దేవాలయం వద్ద అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
స్కూల్ బస్సులపై నిఘా
జిల్లాలోని అన్ని పాఠశాల బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న కెమెరాల పనితీరును తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల రవాణా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
గోల్డెన్ అవర్‌లో వైద్యం
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి గోల్డెన్ అవర్లోనే అత్యవసర వైద్య సేవలు అందేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రమాద బాధితులను సమీప అత్యవసర వైద్య సేవలున్న ఆసుపత్రులకు తక్కువ సమయంలో తరలించేలా గ్రీన్ ఛానల్, ఆసుపత్రుల మ్యాపింగ్, రూట్ మ్యాపింగ్ సిద్ధం చేయాలని ఆదేశించారు. డీసీపీ రాజ మహేంద్ర నాయక్ మాట్లాడుతూ పెంబర్తి వై-జంక్షన్ వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవాబుపేట కర్వ్ వద్ద రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఈ సమావేశంలో జనగామ ఆర్డీఓ గోపీరాం, స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, ఏసీపీ భీం శర్మ, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభి గౌడ్, నేషనల్ హైవేస్ హెచ్ఎంఆర్ఈ మధుసూదన్ రెడ్డి, జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ కమిషనర్ రాధాకృష్ణ, విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, డీపీఓ వెంకట్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
